శ్రీశైలం ప్రమాదం అత్యంత దురదృష్టకరం: మోడీ

శ్రీశైలం ప్రమాదం అత్యంత దురదృష్టకరం: మోడీ

న్యూఢిల్లీ: తెలంగాణలోని శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అగ్ని ప్రమాద మృతులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణాలు తనను కలచి వేశాయని రామ్‌నాథ్ బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటనను దురదృష్టకరమైనదిగా మోడీ చెప్పారు. ‘శ్రీశైలం హైడ్రో ఎలక్ర్టిక్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం. ఎడబాటుకు గురైన కుటుంబాలతో నా ఆలోచనలు ముడిపడి ఉంటాయి. గాయాలైన వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు.

ఈ అగ్ని ప్రమాదం గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 30 మంది ఉన్నారు. వారిలో ఆరుగురిని కాపాడి టన్నెల్ నుంచి బయటకు తీశారు. మరో 15 మంది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ రూట్ ద్వారా బయట పడ్డారు. మిగిలిన తొమ్మిది మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. అక్కడికి చేరుకోవడానికి రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా యత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో ఆ 9 మంది శుక్రవారం మృతి చెందారు. వారి మృత దేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ముగ్గురిని అసిస్టెంట్ ఇంజినీర్స్ సుందర్ నాయక్, మోహన్ కుమార్, ఫాతిమాగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.