మా గ్రామం నుంచి కాలేజీకి వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే..

మా గ్రామం నుంచి కాలేజీకి వెళ్లిన  మొదటి అమ్మాయిని నేనే..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల‌కు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం దేశం నుంచి 45 మంది ఉపాధ్యాయులు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి టీఎన్‌ శ్రీధర్, కందాల రామయ్య, శ్రీమతి సునీత రావు ఉన్నారు. వీరు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రప‌తి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఉపాధ్యాయుల సహకారాన్ని  గుర్తుచేసుకున్నారు.

ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తన గ్రామంలో స్కూలు చదువు ముగించుకుని కళాశాల విద్యకు వెళ్లిన మొదటి అమ్మాయిని తానేనని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. వారు నాకు విద్యను నేర్పించడమే కాకుండా ప్రేమ, స్ఫూర్తిని కూడా ఇచ్చారని చెప్పారు. తన జీవితంలో సాధించినదానికి ఎప్పటికి గురువులకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు. కాగా దేశానికి రెండవ రాష్ట్రపతి (1962-1967) అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.