ఇయ్యాల హైదరాబాద్​ కు ప్రెసిడెంట్​ ముర్ము

ఇయ్యాల హైదరాబాద్​ కు ప్రెసిడెంట్​ ముర్ము
  • బొల్లారంలోని రాష్ట్రపతి  నిలయంలో పకడ్బందీగా ఏర్పాట్లు
  • శీతాకాల విడిదికి అంతా సిద్ధం
  • బొల్లారంలో  పకడ్బందీగా ఏర్పాట్లు
  • భద్రతా బలగాల ఆధీనంలోకి పరిసర ప్రాంతాలు

కంటోన్మెంట్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తన శీతాకాల విడిది కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ రానున్నారు. ముర్ము  ఈ నెల 26 నుంచి 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సందర్భంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో రాష్ట్రపతి నిలయం, పరిసర ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ పరిసరాల్లో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసు, ఆర్మీ, రెవెన్యూ, కంటోన్మెంట్​ పబ్లిక్​ వర్క్స్​డిపార్టుమెంట్​ విభాగాలు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. భద్రతా దళాలు ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ  ప్రాంతంలో రూట్​ కాన్వాయ్ రిహార్సల్స్​ నిర్వహించాయి. 

సాయంత్రం త్రివిధ దళాల వందనం

హకీంపేటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముర్ము చేరుకోగానే ఆమెకు త్రివిధ దళాలు గౌరవ వందనం చేస్తాయి. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేయడం, స్వాగతం పలకడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు అతి ముఖ్యులైన కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే హకీంపేట ఎయిర్​పోర్టులో రాష్ట్రపతితో పాటు మరికొందరు వీఐపీలు రానున్నారు. దీంతో అక్కడ రాష్ట్రపతి వారితో సంభాషించేందుకు కొంత సమయం కేటాయించనున్నందున ఎయిర్​పోర్టు ఆవరణలో టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పటికే రాష్ట్రపతి  నిలయం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. అలాగే ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇక ప్రత్యేక పాస్​లు పొందిన సందర్శకులనే రాష్ట్రపతి నిలయం లోపలకు అనుమతించనున్నారు. ఇక ముర్ము రాక నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రంగులువేశారు. నిలయం ఆవరణలోని ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరిచారు అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. నిలయంలో పాములు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని ఉంచారు. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్, ప్రొటోకాల్​ అడిషనల్​ సెక్రటరీ అరవింద్​ సింగ్, సైబరాబాద్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర,  చీఫ్​ అడ్మినిస్ట్రేటివ్​ అధికారి  నరేంద్ర వర్మ,  వింగ్​ కమాండర్​  చౌధురి, ఎయిర్​పోర్టు ప్రొటోకాల్​ అసిస్టెంట్​ సెక్రటరీ శశిధర్​రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

శంషాబాద్ నుంచి నేరుగా శ్రీశైలానికి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా  సోమవారం ప్రత్యేక విమానంలో  ఉదయం 10.10 గంటలకు  శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకుంటారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి  ఆమె స్పెషల్​ చాపర్​లో శ్రీశైలం ఆలయానికి వెళ్లి మల్లికార్జుస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరిగి నేరుగా 4.30 గంటలకు హకీంపేట్​ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతికి అధికారిక లాంఛనాలతో  స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.