తెలంగాణకు గర్వకారణం

తెలంగాణకు గర్వకారణం

భారతదేశానికి తొలి ప్రధాని  నెహ్రూ  తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సంస్కరణవాది పీవీ. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా క్షీణించి భారత దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్న సంక్లిష్ట, సంక్షోభ సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతరం పీవీ  ప్రధాని అయ్యారు. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్మోహన్ సింగ్​ను ఆర్థిక మంత్రిగా నియమించుకోవడంలోనే అయన దూరదృష్టి అర్థమవుతుంది. 1991–- 92 సంవత్సరాలలో భారతదేశం చైనా కంటే దశాబ్ది ఆలస్యంగానైనా ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం పీవీ వల్లనే సాధ్యమైంది.

ఆర్థిక రంగంలో అప్పటివరకు ఉన్న సంప్రదాయక విధానాలను కాదని నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు బాటలు వేయడంతో ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు భారత ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితం కాగలిగాయి. దాంతో భారతదేశ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల మీద అప్పటివరకు ఆధారపడిన దేశం సేవల రంగంపై దృష్టిని పెట్టింది. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభించి కొనుగోలు శక్తి పెరగడంతో విద్యా,  ఆరోగ్య రంగాలు, మౌలిక సదుపాయాలు గ్రామ గ్రామానికి తరలేందుకు బాటలు పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం బాగా పెరిగింది.

అభివృద్ధి పథకాల అమలులో అందరి భాగస్వామ్యం పెరగడం వల్ల తరతరాలుగా కొనసాగిన పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇతర దేశాల సైన్స్, టెక్నాలజీలను దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా పట్టణాలే కాదు పల్లెల మౌలిక స్వరూపం మారిపోయింది. రేడియో, పత్రికల మీద ఆధారపడిన సమాచార ప్రసార వ్యవస్థ టీవీలు, కంప్యూటర్ల వైపు మళ్ళింది. ఆయన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, ప్రధానైనా.. పీవీ నరసింహరావు వేసినదారిలో అడుగు వేయక తప్పలేదు. ఆర్థిక వ్యవస్థ వేగం పెరగడంతో విదేశీ ఎగుమతులు కూడా బాగా పెరిగి మారకద్రవ్యం పెరిగింది.  ఏదేమైనా పీవీ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పవచ్చు. 
- కె శ్రీనివాసాచారి,  తూప్రాన్