పశుసంపదను కాపాడుకోవాలె

పశుసంపదను కాపాడుకోవాలె

గ్రేటర్​నోయిడా: పశుసంపదను కాపాడుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ముందుకు వెళ్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. ‘లంపి’ అనే చర్మ వ్యాధితో చాలా రాష్ట్రాల్లో పశువులు చనిపోతున్నాయని వివరించారు. దీని కోసం దేశీయంగా వ్యాక్సిన్​ తయారు చేశామన్నారు. ఇండియా ఎక్స్​పో సెంటర్​ అండ్​ మార్ట్​లో నిర్వహించిన ఇంటర్నేషనల్​ డెయిరీ ఫెడరేషన్​ వరల్డ్​ డెయిరీ సమ్మిట్​ (ఐడీఎఫ్​ డబ్ల్యూడీఎస్)–2022ను మోడీ ప్రారంభించి మాట్లాడారు. ‘లంపి’ చర్మ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 2025 నాటికి పశువుల కాళ్లు, నోటి వ్యాధులకు 100% టీకాలు వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 

పాల ఉత్పత్తిలో ఇండియా నెంబర్ వన్​
పాడి పశువులకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని మోడీ తెలిపారు. డెయిరీ పరిశ్రమను విస్తరింపజేసేందుకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ‘పశు ఆధార్’ పేరుతో బయోమెట్రిక్​ ఐడెంటిఫికేషన్​ను తీసుకొచ్చామన్నారు. దీంతో పశువుల హెల్త్​ను మానిటర్​ చేసే చాన్స్​ ఉంటుందని తెలిపారు. డెయిరీ సెక్టార్​లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి.. ఉత్పత్తి పెంచేందుకు.. ‘డెయిరీ ఎకో సిస్టమ్​’ డెవలప్​ చేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా నెంబర్​ వన్​ స్థానంలో ఉందని, 8కోట్ల మంది రైతులు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. డెయిరీ కో–ఆపరేటివ్​ సిస్టమ్​లో భాగంగా 2లక్షలకు పైగా గ్రామాల్లో.. 2కోట్ల రైతుల నుంచి రోజుకు రెండు సార్లు పాలు సేకరించి ప్రజలకు చేరవేస్తామన్నారు. ఈ మొత్తం ప్రాసెస్​లో మధ్యవర్తులకు స్థానం లేదన్నారు. కస్టమర్స్​ నుంచి వచ్చే డబ్బు నేరుగా రైతులకు చేరుతాయని తెలిపారు. గడిచిన 5–6 ఏండ్లలో అగ్రికల్చర్, డెయిరీ సెక్టార్​లో వెయ్యికి పైగా స్టార్టప్స్​ ప్రారంభించామని, ఇందులో మహిళల పాత్ర ఎంతో కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.