కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలే: ప్రధాని మోడీ

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలే: ప్రధాని మోడీ

అకోలా (మహారాష్ట్ర): కాంగ్రెస్​ పార్టీ నేతృత్వంలో ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రాన్ని ‘షాహీ పరివార్’ తన ఏటీఎంగా మార్చుకుంటున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. మహా వికాస్​ అఘాడీ (ఎంవీఏ) అంటే అవినీతి, కుంభకోణాలకు చిహ్నమని పేర్కొన్నారు. ఎంవీఏ అంటే అవినీతి, టోకెన్​ మనీ, ట్రాన్స్​ఫర్ పోస్టింగ్​ బిజినెస్​అని దేశం మొత్తానికి తెలుసునని అన్నారు. మహారాష్ట్రలోని అకోలాలో శనివారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల  ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

కాంగ్రెస్​ పాలిత కర్నాటకలో లిక్కర్​ బిజినెస్​లో రూ.700 కోట్లు కొల్లగొట్టారని, ఆ మొత్తాన్ని మహారాష్ట్రలో ఎన్నికల కోసం తరలించారని మోదీ ఆరోపించారు. తెలంగాణ, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాలు కాంగ్రెస్​ కుటుంబానికి ఏటీఎంలాగా మారాయని అన్నారు. ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే ఇంకెంత దోచుకుంటారో ఊహించుకోండి అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రను కాంగ్రెస్​కు ఏటీఎంలాగా మారనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు.

అంబేద్కర్​ను వాళ్లు ద్వేషిస్తారు 

దళితుడు కావడం వల్ల బాబా సాహెబ్​అంబేద్కర్​ను కాంగ్రెస్​ వాళ్లు ద్వేషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆ పార్టీ నేతలు ఎవరైనా ఎప్పుడైనా అంబేద్కర్ పంచతీర్థను సందర్శించారా?.. సందర్శించినట్టు నిరూపించగలరా?’’ అని సవాల్​ చేశారు. ‘‘అంబేద్కర్ గొప్ప వ్యక్తి. రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత ఆయనకే దక్కింది. బాబా సాహెబ్​ నాకు.. నా ప్రభుత్వానికి స్ఫూర్తి. ఆయన వారసత్వానికి అనుబంధంగా ఉన్న స్థలాలను మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

 యూపీఐకి భీమ్​అని పేరు పెట్టాం” అని మోదీ తెలిపారు. ఎస్సీల హక్కులను హరించాలని కాంగ్రెస్​ యత్నిస్తున్నదని అన్నారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి.. దళితులు, వెనుకబడిన తరగతులను విడదీయడమే కాంగ్రెస్​ పార్టీ గేమ్ ప్లాన్ అని తెలిపారు. కానీ.. హర్యానా ప్రజలు ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని గ్రహించి కాంగ్రెస్​ కుట్రలను భగ్నం చేశారని చెప్పారు. 

అందరికీ ఇల్లు కట్టిస్తా..

గత రెండు టర్మ్​లలో తమ ప్రభుత్వం దేశంలోని 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చిందని మోదీ తెలిపారు.  మరో 3 కోట్ల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ‘‘మీరు ఇతర గ్రామాలను సందర్శినప్పుడు ఇల్లు లేని వారు, గుడిసెల్లో నివసించేవారు కనిపిస్తే.. వారి వివరాలతో సహా చిరునామాను నాకు పంపించండి. వారికి శాశ్వతంగా ఒక ఇల్లు సొంతం అవుతుందని నా తరఫున హామీ ఇవ్వండి” అని మోదీ అన్నారు. తమ మూడో టర్మ్​లో లక్షలాది కోట్లతో అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, మహారాష్ట్రలోని వధవాన్​ పోర్ట్ నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్దది అవుతుందని తెలిపారు. 

 ​మహిళా సంక్షేమం, ఉద్యోగావకాశాలు, ‘లడ్కీ బహిన్​ యోజనా’ పథకం  విస్తరణలాంటి సంక్షేమ స్కీమ్స్​పై మహాయుతి మేనిఫెస్టో దృష్టిపెడితే.. ‘స్కామ్ పత్రం’తో ఎంవీఏ ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు. ‘‘మహారాష్ట్ర ప్రజల నుంచి నాకు ఎప్పుడూ ఆశీస్సులు అందుతూనే ఉన్నాయి. మరోసారి మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను. ఎన్నికల్లో మహాయుతి కూటమిని గెలిపిస్తారని ఆశిస్తున్నా’’ అని మోదీ విజ్ఙప్తి చేశారు. 

25 ఏండ్లలో వికసిత్​ ఉత్తరాఖండ్​

రాబోయే 25 ఏండ్లలో వికసిత్​ భారత్​లో భాగంగా వికసిత్​ ఉత్తరాఖండ్​ హామీని నెరవేరుస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్​ ప్రజలకు 25వ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో ఓ వీడియో సందేశం పోస్ట్​ చేశారు. ‘‘ సిల్వర్​జూబ్లీ జరుపుకుంటున్న దేవ్​భూమి ఉత్తరాఖండ్​ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్​ దశాబ్దం అవుతుంది” అని పేర్కొన్నారు.