
ఈ రోజు సెప్టెంబరు 11.. ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తుచేస్తోంది. మొదటిది.. షికాగోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అన్న ఆయన పలకరింపు ఆ సమావేశ మందిరంలోని వేలాది ప్రేక్షకుల హృదయాలను పులకరింపజేసింది. భారత అజరామర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సార్వత్రిక సోదరభావన ప్రాధాన్యాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రెండోది.. ఉగ్రవాద- దుశ్చర్యల ఫలితంగా సాగిన 9/11 నాటి భీకర దాడులు.
ఇదే రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు-, సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో అనుబంధంగల లక్షలాది మంది ఆయనను సగౌరవంగా.. ప్రేమాభిమానాలతో పరమ పూజ్య ‘సర్‌సంఘ్‌చాలక్’ అని పిలుచుకుంటారు. అవును... నేను చెబుతున్నది మోహన్ భగవత్ గురించే! ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన 75వ జన్మదిన వేడుక నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవం ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
మో హన్ భగవత్ కుటుంబంతో నా అనుబంధం ఎంతో లోతైనది. ఆయన తండ్రి దివంగత మధుకర్ రావు భగవత్‌తో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ అనుభవాన్ని నా రచన ‘జ్యోతిపుంజ్’లో విస్తృతంగా వివరించాను. న్యాయవ్యవస్థతో తన అనుబంధంతోపాటు దేశప్రగతి కోసం ఆయన తనను తాను అంకితం చేసుకున్నారు. దేశ పురోగమనంపై మధుకర్ రావు తపన ఎంతటిదంటే- తన కుమారుడు మోహన్ రావును భారత పునరుజ్జీవనం దిశగా కృషికి పురిగొల్పింది. మధుకర్ రావు ఒక పరుసవేది కాగా, మోహన్ రావు రూపంలో మరో ‘మణి’ని తీర్చిదిద్దారు. మోహన్ 1970 దశకం మధ్య భాగంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అయ్యారు. 'ప్రచారక్' అంటే- ఏదో ఒక సిద్ధాంతం ఆధారంగా సంబంధిత ప్రబోధాలను ప్రచారం చేసే బాధ్యతగా కొందరు అపార్థం చేసుకోవచ్చు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్ పనితీరు గురించి తెలిసిన వారికి ‘ప్రచారక్’ అనేది సంస్థలో కీలక పని సంప్రదాయమనే వాస్తవం తెలుసు. గడచిన వంద సంవత్సరాలుగా దేశభక్తి ప్రేరణగా వేలాది యువత ‘భారతదేశమే ప్రధానం’ లక్ష్యంగా దాన్ని సాకారం చేసే దిశగా తమ జీవితాలను అంకితం చేశారు.
అసమాన నైపుణ్యం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత క్రూర ఎమర్జెన్సీ విధించిన సమయమది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశం ప్రగతిపథంలో పయనించాలని ఆకాంక్షించే ప్రతి వ్యక్తీ దీన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో దూకడం అత్యంత సహజం. అదే తరహాలో మోహన్ సహా అసంఖ్యాక ‘ఆర్‌ఎస్‌ఎస్’ స్వయంసేవకులు కూడా ఇలాగే చేశారు. అనంతర కాలంలో భగవత్ ‘ఆర్‌ఎస్‌ఎస్’లో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయా విధుల నిర్వహణలో ఆయన అసమాన నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా 1990 దశకంలో ‘అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్’ అధిపతిగా మోహన్ పనిచేసిన కాలాన్ని చాలామంది స్వయంసేవకులు నేటికీ ఎంతో ప్రేమాభిమానాలతో స్మరించుకుంటుంటారు. ఆ సమయంలో ఆయన బిహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ్ నిర్మాణం కోసం ఎనలేని కృషి చేశారు. అటుపైన 20వ శతాబ్దారంభంలో ఆయన ‘అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్’గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2000లో ‘సర్‌కార్యవాహ్’ అయ్యారు. ఈ రెండు పదవుల్లోనూ తనదంటూ ప్రత్యేక పనిశైలిని ఆచరణలో పెట్టారు. ఆ తర్వాత 2009లో ‘సర్‌సంఘ్‌చాలక్’గా ఆర్‌ఎస్‌ఎస్ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ అందరికీ ఉత్తేజమిచ్చేవిధంగా పనిచేస్తున్నారు.
బాధ్యతను మించిన కర్తవ్యం
ఈ పదవీ నిర్వహణ సంస్థాగత బాధ్యతను మించిన కర్తవ్యం. సంస్థ ఉద్దేశాలు, నిర్దేశాలపై స్పష్టత, భరతమాతపై అపార ప్రేమగల అసాధారణ వ్యక్తులు త్యాగం, అచంచల నిబద్ధతతో ఈ బాధ్యతలకు కొత్త నిర్వచనమిచ్చారు. శ్రీ మోహన్ భగవత్ ఈ గురుతర బాధ్యతను అనితర సాధ్యంగా నిర్వహించడంతోపాటు స్వీయ శక్తిసామర్థ్యాలు, మేధస్సు జోడించి కరుణార్ద్ర నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా చూపారు. ‘దేశమే ప్రధానం’ అన్న సూత్రమే వీటన్నిటికీ ప్రేరణ! అవిచ్ఛిన్నత, అన్వయం.. మోహన్ జీ మనఃపూర్వకంగా భావించిన, తన కార్యశైలిలో ఇముడ్చుకున్న ముఖ్యమైన అంశాలపై ఆలోచిస్తే ఈ రెండూ నాకు స్ఫురిస్తాయి. నేటి గతిశీల, డిజిటల్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రయోజనకరమైన అంశం. స్థూలంగా చెప్పాలంటే, వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో భగవత్ జీ బాధ్యతలు నిర్వర్తించిన కాలం అత్యంత విప్లవాత్మక సమయమని చెప్పక తప్పదు. యూనిఫాంలో మార్పు నుంచి శిక్షా వర్గాలలో (శిక్షణ శిబిరాలు) మార్పుల వరకు.. ఆయన నేతృత్వంలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి.
దృఢ సంకల్పం
కొవిడ్ కాలంలో మోహన్ జీ కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జీవితకాలంలో మునుపెన్నడూ చూడని ఆ విపత్తు వేళ ఆర్ఎస్ఎస్ సాంప్రదాయక కార్యకలాపాల కొనసాగింపు సవాలుగా మారింది. సాంకేతికత వినియోగాన్ని పెంచాలని మోహన్ జీ సూచించారు. స్వీయ రక్షణ చర్యలతోపాటు ప్రజా రక్షణను కర్తవ్యంగా భావిస్తూ.. ఆపన్నులను ఆదుకునేందుకు ఆ సమయంలో స్వయంసేవకులంతా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అనేక చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించారు. కష్టపడి పనిచేసే మా స్వయంసేవకులను కూడా మేం కోల్పోయాం. కానీ, మోహన్ జీ స్ఫూర్తి వల్ల వారి దృఢ సంకల్పం ఎప్పుడూ సడలలేదు. ఈ ఏడాది మొదట్లో నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆర్‌ఎస్‌ఎస్ మన దేశ సంస్కృతిని, సామూహిక చైతన్యాన్ని శక్తిమంతం చేస్తుందని నేను వ్యాఖ్యానించాను. ఈ అక్షయవట మూలాలు లోతైనవి, బలమైనవి. ఎందుకంటే అవి విలువలతో కూడుకున్నవి. ఈ విలువలను పెంపొందించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి మోహన్ భగవత్ జీ అంకితభావంతో వ్యవహరించిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.
ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్
వివిధ ప్రజా కార్యక్రమాలపై ఆయన చూపించిన ఆసక్తి గురించి కూడా నేను రాయాలనుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి బేటీ బచావో.. బేటీ పడావో వరకు.. ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా భాగస్వామ్యం వహించాలని మొత్తం ఆర్‌ఎస్‌ఎస్ కుటుంబానికీ ఆయన ఎప్పుడూ చెప్పేవారు. సామాజిక శ్రేయస్సు కోసం మోహన్ జీ 'పంచ పరివర్తన్' అందించారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ అవగాహన, జాతీయ భావన, పౌర విధులు ఇందులోని అంశాలు. జీవితంలోని ప్రతి దశలో ఇవి భారతీయులకు స్ఫూర్తినిస్తాయి. బలమైన, సంపన్నమైన దేశాన్ని చూడాలని ప్రతి స్వయంసేవక్ కలలుగంటాడు. దాన్ని సాకారం చేయడం కోసం.. స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణ రెండూ కావాలి. మోహన్ జీలో ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. భగవత్ జీ ఎప్పుడూ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ గురించి బలంగా చెప్తారు. భారతదేశ వైవిధ్యాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. దేశంలో భాగమైన అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఘనంగా చాటుతారు. వివిధ భారతీయ సంగీత వాయిద్యాలలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి అని కొద్ది మందికే తెలుసు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
మరి కొన్ని రోజుల్లో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంవత్సరం విజయ దశమి, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకే రోజున జరగడం కూడా ఒక ఆనందకరమైన యాదృచ్చికం. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న లక్షలాది మందికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది.
ఈ సమయంలో మోహన్ జీ వంటి తెలివైన, కష్టపడి పనిచేసే సర్ సంఘచాలక్ సంస్థను నడిపిస్తున్నారు. మనం అంతరాలకూ హద్దులకూ అతీతంగా ఎదిగి, ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తే సమాజంలో నమ్మకం, సోదరభావం, సమానత్వం బలపడుతుందని చాటిన మోహన్ జీ వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహరణగా నేను చెబుతున్నాను. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో, మోహన్ జీ భరతమాత సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి