ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం

ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం
  • పారిస్​లో దిగినంక ట్వీట్​ చేసిన ప్రధాని మోడీ
  • చాలా రంగాల్లో ఒకరికొకరం సాయం చేసుకుంటున్నమని వెల్లడి
  • ప్రెసిడెంట్​గా మేక్రాన్​ మళ్లీ ఎన్నికైనంక తొలిసారి నేతల సమావేశం
  • కోపెన్​ హేగన్​లో నార్వే, ఐస్​లాండ్​, స్వీడన్​, ఫిన్లాండ్​ ప్రధానులతో భేటీ

న్యూఢిల్లీ/ పారిస్​/ కోపెన్​హెగెన్: ఇండియా, ఫ్రాన్స్​ల బంధం చాలా బలమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు దేశాల దోస్తానా చాలా కాలంనాటిదని, చాలా రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నమని చెప్పారు. యూరప్​ పర్యటనలో భాగంగా చివరి రోజు ప్రధాని మోడీ పారిస్​ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్​గా వారం క్రితమే ఇమ్మాన్యుయెల్​ మేక్రాన్​ మళ్లీ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మేక్రాన్​కు మోడీ అభినందనలు తెలిపారు. అంతకుముందు కోపెన్​హేగన్​లో ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆన్​ డిజాస్టర్​ రెసిలియంట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ నాలుగో ఎడిషన్​ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించారు. ‘మౌలిక సదుపాయాలు అంటే ఆస్తులను కూడబెట్టడం, పెట్టుబడులపై దీర్ఘకాలంలో ఆదాయాన్ని సృష్టించడం కాదు. మౌలిక సదుపాయాల వృద్ధిలో ప్రజలు ఆత్మలాంటి వారు. వారికి నాణ్యమైన, ఆధారపడదగిన సేవలు అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఇండియా చేస్తున్నది ఇదే’ అని మోడీ అన్నారు. ఆధునిక టెక్నాలజీ, విజ్ఞానంతో విపత్తులను తట్టుకునే మౌలిక వసతులను కల్పించాలని, ఇవి విపత్తుల నుంచి భవిష్యత్​ తరాలను కూడా కాపాడతాయని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ఈ దిశగా ఇండియా అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2070 నాటికి నెట్​ జీరో దిశగా అడుగులు వేస్తామని కోప్ –26లో అంగీకరించడానికి కూడా ఇదే కారణమని చెప్పారు. రెండున్నరేండ్ల కాలంలోనే విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కూటమి కీలక చర్యలు చేపట్టిందని అందించిందని తెలిపారు. ఈ సెషన్​లో ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు, మడగాస్కర్​ ప్రెసిడెంట్ తదితరులు కూడా మాట్లాడారు.

నార్డిక్​  దేశాల అధినేతలతో..

ఇండియాలో ఎన్నో అవకాశాలు ఉన్నా యని, ఇండియన్​ కంపెనీలతో జత కట్టేందుకు ముందుకు రావాలని ఫిన్లాండ్​ కంపెనీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ముఖ్యంగా టెలికాం రంగంలో మౌలిక వసతులకు, అలాగే డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​కు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యూరోప్​ పర్యటనలో బుధవారం నార్డిక్​ దేశాల ప్రధానులతో మోడీ సమావేశమయ్యారు. నార్వే, స్వీడన్, ఐస్​లాండ్, ఫిన్లాండ్​ దేశాల ప్రధానుల తో వేర్వేరుగా భేటీ అయ్యారు. నార్డిక్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని మోడీ చెప్పారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా వారితో చర్చించారు. తొలుత నార్వే ప్రధాని జోనస్​ ఘర్​ స్టోర్​తో భేటీ అయ్యారు. నార్వే ప్రధానితో చర్చలు విజయవంతంగా సాగాయని, బ్లూఎకానమీ, క్లీన్​ ఎనర్జీ, స్పేస్, హెల్త్​కేర్ తదితర రంగాల్లో సహకారంపై చర్చలు జరి గాయని మోడీ ట్వీట్​ చేశారు. ఇండియా తాజా గా ప్రకటించిన ఆర్కిటిక్​ పాలసీలో నార్వే కీలకమైన పిల్లర్​ అని మోడీ చెప్పారు. స్వీడిష్ ప్రధాని మెగ్దలీనా ఆండర్​సన్ తో సమావేశం సందర్భంగా జాయింట్​ యాక్షన్​ ప్లాన్​ పై చర్చలు జరిపారు. సెక్యూరిటీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ ​తదితర సెక్టార్లలో సహకారానికి సంబంధించి చర్చించారు. ఐస్​లాండ్​ ప్రధాని కాత్రిన్​ జాకబ్స్​డాటిర్​​ తో ఇరు దేశాల ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంతనాలు సాగించారు. ఫిన్లాండ్​ ప్రధాని సానా మార్టిన్​తో కూడా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి చర్చలు జరిపారు.