త్వరలో భారత్ లో విమానాల తయారీ: ప్రధాని మోడీ

త్వరలో భారత్ లో విమానాల తయారీ: ప్రధాని మోడీ

కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్‭పోర్ట్‭ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్‭పోర్ట్‭ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా యడ్యూరప్పకు మోడీ అభినందనలు తెలిపారు.

ఎయిర్ పోర్టులో చేపట్టిన మరికొన్ని అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎయిర్ పోర్టు మొత్తం కలియతిరిగారు. 

త్వరలో భారత్లో విమానాల తయారీ..

రాబోయే రోజుల్లో భారత్కు వేలాది విమానాలు అవసరం పడుతుందని ప్రధాని మోడీ తెలిపారు.  ఈ రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.  ప్రస్తుతం విదేశాల నుంచి భారత్కు విమానాలు దిగుమతి అవుతున్నాయని.. త్వరలోనే  విమానాలను భారత్లోనే తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు.

జనసంద్రమైన రోడ్ షో...

ఈ ఏడాది కర్ణాటకలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ భారీ రోడ్ షోను నిర్వహించారు. ఎయిర్ పోర్టును ప్రారంభించిన తర్వాత  బెలగావి నగరంలో 10.7 కిలోమీటర్ల భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. కారు ఎక్కి రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అభిమానులకు అభివాదం చేశారు. చన్నమ్మ సర్కిల్ నుంచి ధర్మవీర శంభాజీ సర్కిల్, రామలింగ ఖిండ్ గల్లీలోని అశోక సర్కిల్, తిలక్ సర్కిల్ దగ్గర అభిమానులు మోడీపై పూల వర్షం కురిపించారు. జై మోడీ నినాదాలతో రోడ్ షో హోరెత్తింది. 

యడ్యూరప్ప కలల ప్రాజెక్టు..

శివమొగ్గ ఎయిర్ పోర్టు మాజీ సీఎం యడ్యూరప్ప కలల ప్రాజెక్టు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిర్‭పోర్ట్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ నిర్మాణానికి ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.  శివమొగ్గ విమానాశ్రయాన్ని 775 ఎకరాల్లో దాదాపు రూ. 449 కోట్లతో నిర్మించారు. ఎయిర్‭పోర్ట్‭కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుంది.  బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. తాజా ఎయిర్‭పోర్ట్‭తో కర్ణాటక రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల సంఖ్య తొమ్మిదికి చేరాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‭పోర్టులు ఉన్నాయి)ల సరసన శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ చేరింది.