టెర్రరిస్టులను వెంటాడాలి : ప్రధాని మోడీ

టెర్రరిస్టులను వెంటాడాలి : ప్రధాని మోడీ

టెర్రరిస్టులను వెంటాడాలి
వాళ్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి
టెర్రరిజాన్ని నిర్మూలించాలి
కొన్ని దేశాల ఫారిన్ పాలసీలో టెర్రరిజాన్ని భాగం చేసుకున్నయ్
ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ : కొన్ని దేశాలు టెర్రరిజాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా చేసుకున్నాయని, మరికొన్ని దేశాలు టెర్రరిస్టులపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. పరోక్షంగా పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు. ‘‘టెర్రరిజాన్ని నిర్మూలించడానికి మరింత వేగంగా స్పందించాలి. టెర్రరిస్టులు ఇండ్లలోకి వచ్చే వరకు చూస్తూ కూర్చోవద్దు. మనమే వాళ్లను వెంటాడాలి, వాళ్లకు సాయంచేసే వ్యవస్థలను అడ్డుకోవాలి. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి” అని పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో హోం అఫైర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ‘నో మనీ ఫర్ టెర్రర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ కౌంటర్ – టెర్రరిజం ఫైనాన్సింగ్’ మూడో సమావేశం జరిగింది. 75కు పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనా దేశాలు పాల్గొనడంలేదని అధికారులు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడిన ప్రధాని.. టెర్రరిస్టులపై సానుభూతి చూపించేందుకు ప్రయత్నించే సంస్థలు, వ్యక్తులను ఏకాకులను చేయాలని పిలుపునిచ్చారు.

టెర్రర్ సపోర్టర్లపై భారం మోపాలి

‘‘యుద్ధం జరగడంలేదంటే.. దాని అర్థం శాంతి ఉందని అంతర్జాతీయ సంస్థలు భావించకూడదు. ప్రాక్సీ (పరోక్ష) యుద్ధాలు కూడా ప్రమాదకరమే, హింసాత్మకమే. టెర్రరిజానికి మద్దతిచ్చే దేశాలపై భారం మోపాలి” అని ప్రధాని చెప్పారు. ‘‘తమ ఫారిన్ పాలసీలో భాగంగా కొన్ని దేశాలు.. టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తాయి. రాజకీయంగా, ఆర్థికంగా టెర్రరిస్టులకు మద్దతు ఇస్తాయి. ఇలాంటి విషయాల్లో ‘ఇఫ్’.. ‘బట్’ అంటూ నాన్చకూడదు. బహిరంగంగా, రహస్యంగా టెర్రరిజాన్ని సపోర్ట్‌‌‌‌ చేసే వాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి” అని చెప్పారు.

టెర్రర్​ సాయం ప్రమాదకరం : అమిత్ షా

టెర్రరిస్టులకు సాయం చేయడం.. టెర్రరిజం కన్నా చాలా ప్రమాదకరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. టెర్రరిజాన్ని ఒక మతం లేదా జాతి, లేదా గ్రూపుతో ముడిపెట్టకూడదని చెప్పారు. హింస, యువతను ర్యాడికలైజ్ చేయడం, ఆర్థిక వనరుల కోసం టెర్రరిస్టులు కొత్త మార్గాలను కనుగొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ర్యాడికల్ కంటెంట్‌‌‌‌ను వ్యాప్తి చేసేందుకు టెర్రరిస్టులు డార్క్‌‌‌‌నెట్‌‌‌‌ను ఉపయోగిస్తున్నారన్నారు. టెర్రరిజం ‘డైనమైట్ నుంచి మెటావర్స్‌‌‌‌’కు.. ‘ఏకే 47 నుంచి వర్చువల్ అస్సెట్స్‌‌‌‌’కు ట్రాన్స్‌‌‌‌ఫామ్ అవుతున్నదని, ఇది ప్రపంచాన్ని ఆందోళన కలిగించే అంశమని అమిత్​ షా చెప్పారు.