మీరు బాగుపడాల్నా..కేసీఆర్​ బిడ్డ బాగుపడాల్నా

మీరు బాగుపడాల్నా..కేసీఆర్​ బిడ్డ  బాగుపడాల్నా
  • ప్రజలారా.. ఆలోచించి ఓటేయండి: ప్రధాని మోదీ
  • కుటుంబ పార్టీలకు స్వార్థమే ముఖ్యం.. జనం బాధలు పట్టవు
  • గాంధీ ఫ్యామిలీ బాగుపడాలంటే కాంగ్రెస్​కు, 
  • కేసీఆర్​ బిడ్డ బాగుపడాలంటే బీఆర్​ఎస్​కు ఓటేయండి
  • జనం బాగుపడాల్నంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండి
  • అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక
  • స్కామ్​లు చేసి ఫొటోషూట్​ పెట్టుకున్నరని ప్రతిపక్షాల భేటీపై విమర్శ 
  • మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ప్రసంగం

భోపాల్​: కుటుంబ పాలనపై, కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. కుటుంబ పాలనతో అవినీతి రాజ్యమేలుతున్నదని, అవినీతిపరులను వదిలేదని లేదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం బాగుపడాలంటే కాంగ్రెస్​కు, కేసీఆర్​ బిడ్డ బాగుపడాలంటే బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని, జనం బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయని, దాని వల్ల జనం అభివృద్ధికి దూరమవుతున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి సొమ్మే ముఖ్యమని, వీటికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని చెప్పారు. 

మంగళవారం మధ్యప్రదేశ్​లోని భోపాల్​ మోతీలాల్​ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘మేరా బూత్​ ..సబ్​ సే మజ్బూత్​’ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనాన్ని గాలికి వదిలేసి స్వలాభం కోసం కుటుంబ పార్టీలు పాటుపడుతున్నాయని దుయ్యబట్టారు. ‘‘గాంధీ కుటుంబం, వాళ్ల బిడ్డలు, కొడుకులు బాగుపడాలంటే కాంగ్రెస్​కు ఓటువేయండి. ములాయంసింగ్​   కుటుంబం, ఆయన కొడుకు బాగుపడాలంటే సమాజ్​వాదీ పార్టీకి ఓటు వేయండి. 

లాలూ ప్రసాద్​ కుటుంబం, ఆయన బిడ్డలు, కొడుకులు బాగుపడాలంటే ఆర్జేడీకి ఓటు వేయండి. శరద్ పవార్​ కుటుంబం, ఆయన కూతురు బాగుపడాలంటే ఎన్సీపీకి ఓటు వేయండి. అబ్దుల్లా కుటుంబం, ఆయన కొడుకు బాగుపడాలంటే నేషనల్​ కాన్ఫరెన్స్​కు ఓటు వేయండి. కరుణానిధి కుటుంబం, ఆయన కొడుకులు, బిడ్డలు బాగుపడాలంటే డీఎంకేకు ఓటు వేయండి. కె.చంద్రశేఖర్​రావు బిడ్డ బాగుపడాలంటే బీఆర్​ఎస్​కు ఓటు వేయండి. కానీ.. నా మాట శ్రద్ధగా వినండి. మీ ఆడబిడ్డలు, మీ కొడుకులు, మీ మనుమలు, మనుమరాళ్లు బాగుపడాల్నంటే మాత్రం బీజేపీకి ఓటేయండి. జనం కోసమే బీజేపీ పనిచేస్తుంది. ఆ పార్టీలు మాత్రం కుటుంబం కోసం పనిచేస్తున్నయ్​” అని మోదీ అన్నారు.

మేం ఏసీల్లో కూర్చొని ఆదేశాలివ్వం

ఇటీవల బీహార్​లోని పాట్నాలో ప్రతిపక్షాలు సమావేశమై.. కలిసి కూటమిగా ఏర్పడుతున్నట్లు ప్రకటించడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాము అవినీతిపరులపై చర్యలు తీసుకుంటున్నందుకు, 2024లో మళ్లీ గెలువబోతున్నందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్క చోటుకు చేరాయని విమర్శించారు. ఆ పార్టీలకు కుటుంబం, స్వలాభమే ముఖ్యమని దుయ్యబట్టారు. “పాట్నాలో సమావేశమైన ఆ పార్టీల చరిత్రను ఒక్కసారి చూడండి. ఆ పార్టీలన్నీ రూ. 20 లక్షల కోట్ల అవినీతికి హామీ ఇచ్చినయ్​. అందులో ఒక్క కాంగ్రెస్​ పార్టీనే బొగ్గు, 2జీ, కామన్​వెల్త్ ఇట్లా అనేక స్కామ్​లతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. ఆ సమావేశం అవినీతిపరుల ఫొటోషూట్​” అని అన్నారు. 

అవినీతిపరులను తాము వదిలిపెట్టబోమని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అనేక కులాలు   అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమని, సబ్ కా సాత్​ సబ్​ కా వికాస్..​ బీజేపీ నినాదమని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వబోమని, ప్రజల వెంట ఉండేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలిపారు. మరోసారి కేంద్రంలో బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకోవడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని అన్నారు. అవినీతి కోసం, కుంభకోణాల కోసం హామీలిచ్చే పార్టీల నిజస్వరూపాన్ని జనం ముందు ఉంచాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని ప్రధాని మోదీ సూచించారు. కార్యకర్తలే బీజేపీకి కొండంత అండ అని ఆయన అన్నారు.