హైదరాబాద్ కు వచ్చే ముందు.. తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్

హైదరాబాద్ కు వచ్చే ముందు.. తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు. 

సుమారు రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని కార్యక్రమాల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. బహిరంగసభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూలులో చేర్చారు. కానీ.. ప్రధాని పర్యటనలో కేసీఆర్‌ పాల్గొనడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతం పలకనున్నారు.

ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11 గంటల30 నిమిషాలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. 11 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల పాటు ఉంటారు. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలును ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాని మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు పరేడ్‌ మైదానానికి చేరుకుంటారు. ఈ వేదికపై నుంచే పలు జాతీయ రహదారుల పనులకు, బీబీనగర్‌ ఎయిమ్స్‌ నూతన భవన సముదాయానికి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే పూర్తయిన సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్‌ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. 12 గంటల 50 నిమిషాల నుంచి ఒంటి గంట 20 నిమిషాల వరకు సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు.

https://twitter.com/narendramodi/status/1644546727834181632