తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు

తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు
  •     మిషన్ భగీరథ పనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ
  •     వరంగల్​, మహబూబాబాద్​, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో మిషన్​ భగీరథ పనులపై ఆరా

హనుమకొండ, వెలుగు : వేసవి దృష్ట్యా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీఆర్, ఆర్​డబ్ల్యూఎస్​ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్​ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. వరంగల్, మహబూబాబాద్​, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మిషన్​ భగీరథ పనులపై సంబంధిత జిల్లా అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన రివ్యూ చేశారు. ఉమ్మడి వరంగల్ లో తాగునీటి పరిస్థితులపై ఆరా తీసేందుకు వచ్చిన ఆయన మొదట ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్​తో పాటు పూసూరు వద్ద ఉన్న ఇన్​ టేక్ వెల్స్​ను సందర్శించారు.

అనంతరం రామప్ప సరస్సును పరిశీలించారు. ఆ తరువాత హనుమకొండ జిల్లా హసన్​పర్తి వద్ద ఉన్న మిషన్​ భగీరథ ఆఫీస్​లో నాలుగు జిల్లాల ఎస్​ఈలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ఈఎన్​సీ కృపాకర్​ రెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల సీఈ శ్రీనివాసరావు, మహబూబాబాద్​ సీఈ లలిత, వరంగల్, హనుమకొండ ఎస్​ఈలు మల్లేశం, రాములు, ఆయా జిల్లాల డీఈలు, డీపీవోలు పాల్గొన్నారు. 

సమృద్ధిగా తాగునీరు అందించాలి..

ఏటూరునాగారం, వెలుగు: ఎండా దృశ్య ప్రజలకు తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా సమృద్ధిగా నీటిని అందించాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్ డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ వద్ద గోదావరినది ఇంటెక్ వెల్, వాజేడు మండలంలోని పుసూరు ఇంటెక్ వెల్ ను ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీరు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

ఇందులో భాగంగానే ఇంటెక్ వెల్ ల వద్ద నీటి నిల్వలను పరిశీలించామన్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎవరూ నీటి వృథా చేయొద్దన్నారు. జిల్లాలోని పంపు హౌజ్ ల ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఏటూరునాగారం మండలం రాంనగర్ ఇంటెక్ వెల్ ద్వారా57 గ్రామాలకు, వాజేడు మండలం పూసూరు ఇంటెక్ వెల్ ద్వారా వాజేడు మండలంతో పాటు వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరునాగారం

మంగపేట మండలాల్లోని 256 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామని వివరించారు. రామప్ప పంప్ హౌస్ ద్వారా గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాల్లోని 165 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 2,346 బోర్ వెల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఆర్​డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ చీఫ్ కృపాకర్ రెడ్డి గోదావరి నదిలోని రాంనగర్, పూసూరు ఇంటెక్ వెల్ ల పనితీరు, నీటి సామర్థ్యం, సరఫరా విధానం తదితర అంశాలను సుల్తానియాకు వివరించారు. వారివెంట ఆర్​డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, ఎస్ఈ మల్లేశం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాణిక్యరావు ఉన్నారు.