
చౌటుప్పల్, వెలుగు : రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ తెలిపారు. సోమవారం యాదాద్రిజిల్లా చౌటుప్పల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేసే తెలంగాణ నేతన్న భరోసా, నేతన్న భద్రత, నేతన్న పొదుపు, రుణమాఫీ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యఅతిథిగా హాజరై పథకాలపై , విధివిధానాలపై చేనేత కార్మికులకు వివరించి అవగాహన కల్పించారు.
ఏడాదిలో నాలుగు వార్పులు (28 చీరలు) నేసి, వాటిపై తెలంగాణ హ్యాండ్లూమ్ ముద్రను అంటించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసులో తెలియజేస్తే.. ప్రతి చేనేత కార్మికుడికి 18, 000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున ఖాతాలో డబ్బులు జమ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ బి .ఇందుమతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి. పద్మ, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎ .శ్రీనివాస్, ఎస్. ద్వారకా, డీవోలు, ఏడీవోలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చేనేత కార్మికులు పాల్గొన్నారు.