చనిపోయిన వ్యక్తికి ట్రీట్​మెంట్​ చేశారని ఆందోళన

చనిపోయిన వ్యక్తికి ట్రీట్​మెంట్​ చేశారని ఆందోళన

నల్గొండ అర్బన్​, వెలుగు :  చనిపోయిన వ్యక్తికి ట్రీట్​మెంట్​ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ గురువారం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.  సూర్యాపేట సమీప గ్రామానికి చెందిన నరేశ్​ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో బుధవారం ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి హైదరాబాద్ కు రెఫర్​ చేశారు. అయితే పట్టణంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అప్పటికే నరేశ్ చనిపోయినప్పటికీ చెప్పకుండా హాస్పిటల్​లో చేర్చుకుని వైద్యం చేసినట్లు నటించి  డబ్బులు వసూలు చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

తమకు న్యాయం చేయాలని డిమాండ్ ​చేస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై ఆసుపత్రి డాక్టర్​శశాంక్​ మాట్లాడుతూ తల, ఛాతిపై తీవ్ర గాయాలతో ఉన్న నరేశ్​ను బుధవారం హాస్పిటల్​కు తీసుకొచ్చారని,  99 శాతం బతకడం కష్టమేనని చెప్పినప్పటికీ  వారు వినలేదన్నారు. గురువారం మళ్లీ వారి బంధువులను పిలిచి  బతకడం కష్టమేనని చెప్పామని తెలిపారు. వారు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయే లోపు చనిపోయాడని చెప్పారు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్​మెంట్​ 
చేశామని చెప్పడంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.