అడ్డగోలుగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు

అడ్డగోలుగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
  • ప్లేట్ లెట్లు తగ్గాయంటూ రోగుల్ని భయపెడుతున్న మేనేజ్​మెంట్లు 
  • కిటకిటలాడుతున్న హాస్పిటల్స్ 
  • సర్కారులో సౌలతుల్లేక ప్రైవేట్​కు పోతున్న జనం 
  • జగిత్యాల జిల్లాలో 15 రోజుల్లోనే 12 మంది మృతి 
  • కేసులు తక్కువ చూపుతూ..మరణాలే లేవంటున్న ప్రభుత్వం 

నెట్​వర్క్, వెలుగుప్రజలపై డెంగీ పంజా విసురుతోంది. జిల్లాలు మొదలుకొని హైదరాబాద్​లోని కార్పొరేట్ ఆస్పత్రుల వరకు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సర్కార్ దవాఖాన్లపై నమ్మకం లేక రోగులు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు పోతున్నారు. అక్కడ బెడ్లు దొరక్క తిప్పలు పడ్తున్నారు. ఎలాగోలా బెడ్స్ దొరకబట్టుకొని అడ్మిట్ అయ్యాక .. రకరకాల టెస్టులంటూ, ప్లేట్​లెట్లు తగ్గాయంటూ భయపెడుతూ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. జిల్లాల్లో రోజుకు రూ.50 వేలకు పైగా వసూలు చేస్తుండగా, హైదరాబాద్‌‌‌‌లో రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అప్పుసప్పు చేసి లక్షలకు లక్షలు బిల్లు కట్టినా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది డెంగీ బారిన పడుతుంటే సర్కారీ లెక్కల్లో మాత్రం 9,298 కేసులు మాత్రమే నమోదైనట్టు చూపిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లాల్లో నిత్యం డెంగీ మరణాలు నమోదవుతుంటే.. ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదని చెబుతున్నారు. డెంగీ కేసులు పెరుగుతున్నందున ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేపడుతామని సర్కార్ చేసిన ప్రకటన పేపర్లకే పరిమితమైంది. ఎక్కడ కూడా నివారణ చర్యలు కనిపించడం లేదు. 

డెంగీ మరణాలను లెక్కిస్తలె.. 

జగిత్యాల జిల్లాలో డెంగీతో 15 రోజుల్లోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాయికల్​మండలంలోనే 10 మంది చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని అధికారులు చెప్తున్నా ఆ లక్షణాలతోనే ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో ఒక యువకుడు, పెద్ద శంకరంపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని డెంగీ చికిత్స పొందుతూ చనిపోయారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లికి చెందిన భరత్​రెడ్డి (22) అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఈ నెల 17న డెంగీతో  చనిపోయాడు.  హనుమకొండ జిల్లాలో 10 నెలల బాబు ఈ నెల 17న డెంగీతో ప్రాణాలు కోల్పోయాడు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన పచ్చునూరి పోషయ్య(60) 20 రోజుల కింద ఎంజీఎంలో  డెంగీ చికిత్స పొందుతూ మరణించాడు. అన్ని జిల్లాల్లో డెంగీ మరణాలు నమోదవుతున్నా అధికారులు కన్ఫార్మ్ చేయడం లేదు. 

ప్లేట్ లెట్ల పేరు చెప్పి భయపెడుతున్నరు.. 

సర్కార్ దవాఖాన్లలో సౌలతులు లేకపోవడం, డెంగీ మరణాలు పెరుగుతుండడంతో జనం భయంతో ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఇదే అదనుగా ఆయా మేనేజ్ మెంట్లు దోపిడీకి పాల్పడుతున్నాయి. మామూలు జ్వరాలను కూడా డెంగీగా చూపుతూ  పేషెంట్లను భయపెడుతున్నాయి. ప్లేట్​లెట్ల పేరు చెప్పి అందినకాడికి దండుకుంటున్నాయి. హైదరాబాద్​లోని కార్పొరేట్ ఆసుపత్రులైతే వివిధ రకాల ఫీజులంటూ రోజుకు  రూ.లక్ష దాకా గుంజుతున్నాయి. జిల్లాల్లో ఆర్ఎంపీలు, ఆసుపత్రి యాజమాన్యాలు ఒక మాఫియాలా తయారై రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఆర్ఎంపీలకు కమీషన్లు ఇస్తుండడంతో వారు ఊళ్ల నుంచి పేషెంట్లను ఒక ప్లాన్​ ప్రకారం ప్రైవేట్​ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆయుష్మాన్​భారత్ కింద డెంగీ ట్రీట్​మెంట్​కు అవకాశం ఇచ్చినప్పటికీ సర్కారు ఇచ్చే మొత్తం తక్కువగా ఉండడంతో ట్రీట్​మెంట్​కు ప్రైవేట్​ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. 

  • ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ఒక్క మహబూబ్​నగర్​లో మాత్రమే ప్లేట్​లెట్​సెపరేటర్​, ఎలీసా టెస్ట్ ఎక్విప్​మెంట్ ఉన్నాయి. దీంతో నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి లాంటి జిల్లాల బాధితులు  ప్రైవేట్​లో టెస్టులు చేయించుకుంటున్నారు. ప్లేట్​లెట్లు తగ్గితే చాలు వారిని అడ్మిట్ చేసుకొని రోజుకు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. 
  • నల్గొండ జిల్లాలో ఈ నెలలో ఇప్పటికే 99 డెంగీ కేసులు వచ్చాయి. సూర్యాపేట, యాదాద్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లేట్​లెట్​సెపరేటర్ లేకపోవడంతో రక్తకణాలు తగ్గినవారిని నల్గొండలోని ప్రైవేట్​ఆసుపత్రులకు తరలించి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. 
  • సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని సర్కారు దవాఖాన్లలోనూ ప్లేట్​లెట్​సెపరేటర్​లేకపోవడంతో కరీంనగర్​కు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ రూ.50 వేల దాకా గుంజుతున్నారు.  
  • మంచిర్యాలలోని ప్రైవేట్ దవాఖాన్లలో ప్లేట్​లెట్ల సంఖ్య తగ్గిందని భయపెట్టి ఐసీయూలో చేర్చుకొని రోజుకు రూ.15వేల నుంచి రూ.30వేల దాకా బిల్లు వేస్తున్నారు. ప్లేట్ లెట్స్ ఎక్కించడానికి  మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు.


5 లక్షలు పెట్టినా బాబు ప్రాణం దక్కలె 

హనుమకొండ జిల్లా కమలాపూర్​కు చెందిన పబ్బు ఓదేలు కొడుకు రియాన్ష్ (10 నెలలు)కు ఈ నెల మొదటి వారంలో జ్వరం వచ్చింది. 12న ఫీవర్ ఎక్కువ కావడంతో హైదరాబాద్​కు తీసుకెళ్లారు. అక్కడ ఐదు హాస్పిటల్స్ తిరిగినా బెడ్ దొరకలేదు. చివరికి బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేర్పించారు. డెంగీ అని చెప్పి ఐసీయూలో ఐదు రోజులు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఫీజులన్నీ కలిపి దాదాపు రూ.5 లక్షలు ఖర్చయ్యాయి. అయినా బాబు ప్రాణం దక్కలేదు. ఈ నెల 17న  ఆసుపత్రిలోనే చనిపోయాడు. 

ఆరుసార్లు ప్లేట్ లెట్స్ ఎక్కించిన్రు

మంచిర్యాల శ్రీశ్రీనగర్‌‌కు చెందిన వర్షిత్​రావు(18) వారం కింద జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించారు. అక్కడ కోలుకోకపోవడంతో కరీంనగర్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లేట్ లెట్స్, రెండు సార్లు ప్లాస్మా ఎక్కించారు. రాత్రి ప్లేట్ లెట్స్ ఎక్కిస్తే తెల్లారేసరికి తగ్గుతున్నాయి. ఒకసారి ప్లేట్ లెట్స్ ఎక్కించడానికి రూ.12 వేలు ఖర్చవుతోంది. మందులు, హాస్పిటల్ చార్జీలు రోజుకు రూ.30 వేలు అవుతున్నాయి. వర్షిత్‌ రావు తండ్రి బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు.

రెండ్రోజుల్లో ప్రాణం పోయింది.. 

నిజామాబాబాద్​ జిల్లా నవీపేట్​కు చెందిన మురళి బాసరలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన భార్య ప్రశాంతి (47)కి రోజుల తరబడి జ్వరం తగ్గకపోవడంతో టెస్టు చేయిస్తే డెంగీ అని తేలింది. అప్పటికే ప్లేట్​లెట్స్​14వేలకు పడిపోవడంతో కొంపల్లిలోని శ్రీకర హాస్పిటల్ లో ఈ నెల 10న జాయిన్​ చేశారు. 12న ఆమె చనిపోయింది. రెండ్రోజుల్లో ట్రీట్ మెంట్ కు రూ.2 లక్షలు అయిందని, అయినా భార్య ప్రాణం కాపాడుకోలేకపోయానని మురళి ఆవేదన వ్యక్తం చేశాడు.