బీఆర్​ఎస్​ది మాఫియా రాజ్యం .. లిక్కర్​ నుంచి ప్రాజెక్టుల దాకా స్కాములమయం

బీఆర్​ఎస్​ది మాఫియా రాజ్యం .. లిక్కర్​ నుంచి ప్రాజెక్టుల దాకా స్కాములమయం
  • జనం గోసపడ్తున్నా.. కేసీఆర్​  ఫామ్​హౌస్​ దాటడు: ప్రియాంక
  • బీఆర్​ఎస్​ లీడర్లు కోటీశ్వరులయ్యారు.. జనం గరీబులయ్యారు
  • బీజేపీ, బీఆర్​ఎస్ ​ఒక్కటే.. వాళ్లకు ఎంఐఎం తమ్ముడు
  • మేం ప్రజలను నమ్ముకున్నం.. వాళ్లు డబ్బును నమ్ముకున్నరు
  • దొరల పాలనకు బైబై చెబుదాం.. ప్రజా తెలంగాణగా మార్చుకుందాం
  • గద్వాల, కోస్గి సభలు, భువనగిరి రోడ్​షోలో ప్రసంగం

మహబూబ్​నగర్/గద్వాల/ కోస్గి/యాదాద్రి, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఫామ్​హౌస్ పాలన నడుస్తున్నదని.. లిక్కర్, భూ మాఫియా రాజ్యమేలుతున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ గురించి నాకు తెలియదు. కానీ, ఆయన అవినీతి పాలన గురించి బాగా తెలుసు. అమరుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశపడ్డా. కానీ బీఆర్ఎస్ ​ప్రభుత్వం అమరుల 
కుటుంబాలను విస్మరించింది. యువతకు ఉపాధి కరువైంది. ఈ సర్కార్​ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టలేదు. పైగా ప్రాజెక్టుల పేరుతో కోట్లకు కోట్లు దోచుకుంది. ఆ డబ్బునే ఇప్పుడు ఎలక్షన్లలో ఖర్చు పెట్టేందుకు రెడీ అయింది. దొరల పాలనకు బైబై​ చెబుదాం” అని పేర్కొన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రం, నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కాంగ్రెస్ సభల్లో, యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన కార్నర్ ​మీటింగ్​లో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. 

బీఆర్ఎస్ ఎన్నో కుంభకోణాలు చేసిందని, బీజేపీ అండతో డబ్బున్న పార్టీగా ఎదిగిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్​మధ్య పైసల ఒప్పందం జరిగిందని, అందుకే కావాల్సినప్పుడుల్లా బీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతుగా నిలుస్తున్నదని దుయ్యబట్టారు. ‘పైసలు ఇస్తాం.. అధికారంలోకి వస్తాం’ అనే నినాదంతో బీఆర్ఎస్​ముందుకుపోతున్నదని, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆమె సూచించారు. పొరపాటున బీఆర్ఎస్​మూడోసారి గెలిస్తే మళ్లీ దొరల తెలంగాణ వస్తుందని, రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్​పార్టీతోనే ప్రజా తెలంగాణ సాధ్యమవుతుందని ఆమె అన్నారు. 

మిత్రుల కోసమే మోదీ ఆరాటం

ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్లుగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. మిత్రుల కోసమే మోదీ పాలన సాగిస్తున్నారని,  ప్రజల సొమ్మును మిత్రులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘దోస్తులు తీసుకున్న రుణాలు మాఫీ చేసే మోదీ.. రైతులను గాలికొదిలేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్​ విధానాన్ని కోరుతుంటే.. డబ్బులు లేవని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజస్థాన్, కర్నాటక పాలసీలను అమలు చేసి పేదలను ఆదుకుంటాం” అని ఆమె చెప్పారు.  

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. కర్నాటకలో ఐదు స్కీములు అమలవుతున్నాయని, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చేనేత పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. 

యువతకు ఏదీ న్యాయం?

యువత పోరాటం, ప్రాణ త్యాగాలకు చలించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రియాంక గాంధీ తెలిపారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా బీఆర్​ఎస్​ పాలనలో యువతకు న్యాయం జరగడం లేదని అన్నారు. ‘‘ఉపాధి కల్పన లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. పోటీ పరీక్షలంటూ సర్కారే పేపర్లు లీక్​ చేసింది. బీఆర్ఎస్​ లీడర్లు కోటీశ్వరులై విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే ప్రజలు గరీబులయ్యారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. 

కాంగ్రెస్​ను గెలిపిస్తే రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో మాదిరిగా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, భూములపై ప్రజలకే హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల అభ్యున్నతి కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాదిగ, మాల కులాలకు ఒక్కో కార్పొరేషన్, ఉప కులాల కోసం మరో కార్పొరేషన్​ పెడతామని చెప్పారు. ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలను కాంగ్రెస్ నమ్ముకుంటే.. పోల్​ మేనేజ్​మెంట్, పైసలను బీఆర్ఎస్ నమ్ముకుందని అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని, డబ్బుకు అమ్ముడుపోరని తెలిపారు. ట్రిపుల్ ఆర్​కారణంగా రైతులు ఎంతో నష్టపోతున్నారని, వారికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. 

పాలకులు నిద్రపోతున్నరు

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అవినీతి పెరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి.  వ్యవసాయ రంగాన్ని బీఆర్​ఎస్​ సర్కార్​ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పనిముట్లకు లోన్లు కూడా ఇవ్వడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  

పట్టించుకోవాల్సిన పాలకులు తీరిగ్గా ఫామ్​హౌస్​లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నా కేసీఆర్, ఆయన పార్టీ నేతలు ఫామ్​హౌస్​లను, భవంతులను విడిచి బయటకు రారు. రాష్ట్రంలో ల్యాండ్​ మాఫియా, సాండ్​ మాఫియా, మైన్​ మాఫియా, వైన్​ మాఫియా రెచ్చిపోతున్నది. బీఆర్​ఎస్, బీజేపీకి ఎంఐఎం ఎప్పుడూ అండగా ఉంటుంది.  బీజేపీకి లాభం కలిగించేందుకే ఎంఐఎం తెలంగాణలో కేవలం 9 సీట్లలోనే పోటీ చేస్తున్నది.  
- ప్రియాంక గాంధీ