పదేళ్లు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ సలహాలు వినండి

పదేళ్లు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ సలహాలు వినండి

కరోనా సెకండ్ వేవ్ తో  దేశం మొత్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తి కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అరికట్టేందుకు  ఇప్పటికే లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు విధించాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులపై  స్పందించిన కాంగ్రెస్ నాయకురాలుప్రియాంక గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా.. విపక్షాల సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించడం లేదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాలను కూడా మోడీ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. పబ్లిసిటీని పక్కనపెట్టి, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పాకిస్తాన్ కు  చెందిన ISIతో మాట్లాడేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని... కానీ, విపక్ష నేతల మాటలను వినేందుకు మాత్రం ఇష్టపడటం లేదని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ఈ దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించారని.. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే సూచనలను అంతే గౌరవంతో స్వీకరించాలని చెప్పారు. కేంద్రానికి మన్మోహన్ రాసిన లేఖపై ఒక మంత్రి స్పందించడంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో విదేశాలకు 6 కోట్ల వ్యాక్సిన్లను పంపించారని.. ఇదే సమయంలో మన దేశ ప్రజలు కేవలం మూడు నుంచి నాలుగు కోట్ల డోసులను మాత్రమే అందుకున్నారని ప్రియాంక తెలిపారు. ఈ దేశానికి కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ దేశానికంటే పబ్లిసిటీకే ప్రధాని ఎందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ప్రశ్నించారు.22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ కు కేవలం కోటి డోసులను మాత్రమే పంపించారన్నారు. మోడీ ఎన్నికల ర్యాలీలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు.

కరోనాతో బెడ్లు, ఆక్సిజన్, మందుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రధాని మాత్రం ఎన్నికల ర్యాలీల్లో నవ్వులు చిందిస్తున్నారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం కష్టాల్లో ఉంటే మీకు నవ్వు ఎలా వస్తోందని ప్రశ్నించారు ప్రియాంక.