పరారీలో బండ్లగణేశ్… కేసు పెట్టిన పోలీసులు

పరారీలో బండ్లగణేశ్… కేసు పెట్టిన పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పై కేసు నమోదైంది. నిన్న అర్ధరాత్రి అనుచరులతో వచ్చి.. తనను బెదిరించారంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు.  పీవీపీ ఇచ్చిన కంప్లయింట్ తో.. బండ్ల గణేశ్ పై జూబ్లిహిల్స్ పోలీసులు 420, 448, 506 r/w 43 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. బండ్లగణేశ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

2013 టెంపర్ సినిమా కోసం రూ.30 కోట్లను బండ్ల గణేష్ తన దగ్గర తీసుకున్నాడని పొట్లూరి వరప్రసాద్ చెప్పారు. ఈ రూ.30 కోట్లలో రూ.7 కోట్లు ఇంకా బాకీ పడ్డాడని చెప్పారు. కొంతకాలంగా డబ్బులు ఇవ్వకుండా బండ్లగణేష్ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. మొన్న సోమవారం పార్క్ హయత్ హోటల్లో బండ్ల గణేష్ కలిశాడనీ.. ఇవ్వాల్సిన రూ.7 కోట్లు సెటిల్ చేయాలని బండ్ల గణేష్ ని అడిగానని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగాడన్నారు. తనకు హోం మంత్రి తెలుసు అంటూ బండ్ల గణేష్ బెదిరింపులకు దిగాడని అన్నారు పొట్లూరి.

తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశానననీ..  కొంత మంది డబ్బులు ఇచ్చారు కొంత మంది ఇవ్వలేదని చెప్పారు పొట్లూరి. “ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి దగ్గరకు వచ్చి సెటిల్ చేసుకోవాలని బెదిరించారు. 40 నిమిషాలు నా ఇంటి చుట్టూ తిరుగుతూ నాకు అనుమానాస్పదంగా కనిపించారు. అందుకే పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను. బండ్ల గణేష్ నాకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చాను అని చెప్తున్నాడు. నిరూపిస్తే మరో రూ.30 కోట్లు నేను ఇస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు బ్యాంక్ స్టేట్ మెంట్ లు పోలీసులకు ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను”అని చెప్పారు పొట్లూరి వరప్రసాద్.