పేదల భూములు గుంజుకుని రీజనల్​ రింగ్​రోడ్డు కోదండరాం

పేదల భూములు గుంజుకుని రీజనల్​ రింగ్​రోడ్డు కోదండరాం

కొండాపూర్/సంగారెడ్డి టౌన్, వెలుగు: పేదల భూములు గుంజుకుని రీజనల్​ రింగ్​రోడ్డు వేయడం కరెక్ట్​ కాదని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొ.కోదండరాం చెప్పారు. సీఎం కేసీఆర్ సామాన్య రైతుల బతుకులను బజారుకీడుస్తూ మరో నిజాం పాలన కొనసాగి స్తున్నారని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మద్దతుగా సంగారెడ్డి జిల్లా టీజేఎస్​అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గిర్మాపూర్ నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. కోదండరాం పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సీఎం, ఇద్దరు మంత్రులు రియల్​ఎస్టేట్​వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు విచ్చలవిడిగా భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రాజెక్టులు, రోడ్ల పేరుతో 9 వేల ఎకరాలు గుంజుకున్నారన్నారు. భూసేకరణకు ఉమ్మడి మెదక్ అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ పేరుతో నర్సరీలు, తోటలు పెంచుకుంటూ బతుకుతున్న 300 మంది రైతుల కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు కోసం 6 గ్రామాల్లో భూసేకరణ చేస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

యాదగిరి గుట్టలో సర్వే అడ్డగింత
యాదాద్రి: రీజనల్​రింగ్​రోడ్డు అలైన్​మెంట్​మార్చేంత వరకు సర్వేను అడ్డుకుంటూనే ఉంటామని యాదాద్రి జిల్లాలోని ఎర్రంబెల్లి రైతులు తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం గ్రామానికి వచ్చిన సర్వే బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. అలైన్​మెంట్​ మార్చాలంటూ వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే మూడుసార్లు భూములు తీసుకున్నారని, ఇంకెన్నిమార్లు తీసుకుంటారని నిలదీశారు. తెలంగాణ వచ్చినంక చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇస్తలేరని కనీసం భూమి దున్నుకొని బతుకుదామంటే లాక్కుంటున్నారని యువరైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సర్వే సిబ్బంది అక్కడ్నుంచి  వెళ్లిపోయారు.