జయశంకర్ కోరుకున్న ఆత్మగౌరవ తెలంగాణ ఇదేనా?

జయశంకర్ కోరుకున్న ఆత్మగౌరవ తెలంగాణ ఇదేనా?

జీవితాన్ని ప్రజాశ్రేయస్సు కోసమే వెచ్చించి, హక్కుల ఉద్యమాలతో మమేకమై, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్​ జయశంకర్ సార్​. తన జీవితమంతా ప్రగతిశీల ఉద్యమాలు, ఆదర్శవంతమైన సమాజం కోసమే అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి, ఆత్మ గౌరవ పోరాటంగా చాటి చెప్పారు. తొలి దశ పోరాటం నుంచి ఎందరో బిడ్డల్ని కోల్పోయి ‘తెలంగాణ తల్లి’ రోధిస్తున్న సమయంలో ఈ బాధల వెనుక రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీమాంధ్రులు సాగిస్తున్న దోపిడీ, 60 ఏండ్ల అణచివేత ఉన్నాయని గుర్తించి ప్రశ్నించారు. తెలంగాణకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాల గురించి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేసి వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిలించి స్వరాష్ట్రం సాధించేలా చేశారు. కానీ, జయశంకర్ సార్​  కోరుకున్న ఆత్మగౌరవ, అభివృద్ధి తెలంగాణ ఇప్పుడు వచ్చిందా? అనేదే ఇప్పుడు మనందరి ముందు ఉన్న ప్రశ్న.

తెలంగాణ ఉద్యమంలో సకల జనులను భాగస్వామ్యం చేయడానికి ‘తెలంగాణ భావజాల వ్యాప్తి-–ప్రజా ఆందోళనలు- – రాజకీయ ప్రక్రియ’లకు ప్రొఫెసర్​ జయశంకర్ సార్ ​ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ పోరాట ప్రతీకలను ముందుకు తీసుకొచ్చి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అణిచివేత చర్యలను తీవ్రంగా ఖండించారు. ఒకవైపు రాజకీయ సమీకరణాల విషయంలో సలహాలు ఇస్తూనే.. మరోవైపు మేధావులు, కవులు, రచయితలు, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి సడలకుండా కృషి చేశారు. ఉద్యమం చల్లబడుతున్నప్పుడల్లా రాజకీయ నాయకులను, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని బతికించారు. రాజకీయ పార్టీలు, నాయకుల పునాదులు కదిలించి ప్రజలకు పార్టీలపై గల భ్రమలను తొలగించారు. భావజాల వ్యాప్తి ద్వారా యువతను అగ్గిరవ్వలుగా మార్చారు. మన సంస్కృతి, పండుగలను మరిచి బతుకుతున్న వాళ్లను ఒక దగ్గర చేర్చారు. ఉద్యమాన్ని ఎవరు మధ్యలో వదిలినా తను మాత్రం ముందుకు సాగారు. తెలంగాణ సాధన తండ్లాటను ఊర్లకు పాకించడం తప్ప ఇంకొక మార్గం లేదన్నారు. ఎట్టకేలకు అవమానాలు, ఆధిపత్యం, దోపిడీ నుంచి బయటపడి అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 

సంపద అమ్మడం ఆయన ఆలోచనలకు విరుద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దశాబ్దాల పాటు సీమాంధ్ర పాలకులు సృష్టించిన విధ్వంసానికి, వారి పాలనా సంస్కృతికి భిన్నంగా విధాన నిర్ణయాలు జరగాలని జయశంకర్ సార్​ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలనా విధానాలను కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల కేంద్రంగా రూపకల్పన చేశారని, తెలంగాణలో పాలనలోనూ, పైసల్లోనూ ప్రజలను భాగస్వామ్యం చేసేలా విధానాల రూపకల్పన జరగాలని, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో ‘సంపద’ను సృష్టించాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని జయశంకర్ సార్​ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్​ కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘మనం అభివృద్ధి చెందాలంటే సంపదను సృష్టించాలి. అందుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం సమకూరుస్తుంది’ అని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణ సంపదను బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తూ కాంట్రాక్టర్లకు/కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ తెలంగాణను ఆగంపట్టిస్తూ.. సీమాంధ్ర పాలకుల విధానాలనే ఏండేండ్లుగా అనుసరిస్తూ వారి కంటే పది రెట్లు దోపిడీ చేస్తున్నారు. 

నదీ జలాలపై సీఎం మౌనం దేనికి సంకేతం?

నీళ్ల విషయానికి వస్తే కృష్ణా, గోదావరి జలాల్లో మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను అన్యాయంగా ఆంధ్రా ఆధిపత్య వర్గాలు ఎత్తుకు పోతున్నాయని, మన దగ్గర ప్రాజెక్టులను కట్టకుండా మన పంటలను ఎండబెడుతున్నారని లెక్కలతోపాటు సమాజం ముందు ఉంచిన జయశంకర్ సార్​ పాలకులకు గుర్తున్నారా? ఆయన చెప్పిన లెక్కలు గుర్తున్నాయా? కృష్ణా నది 68% తెలంగాణలో పారుతున్నా.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 34% జలాలు కూడా మనకు దక్కడం లేదంటే సమస్య ఎవరిది? గోదావరి తెలంగాణలో 79% ప్రవహిస్తున్నా 32% జలాలు కూడా దక్కడం లేదు. అంటే నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పక్క రాష్ట్రంతో, అటు కేంద్రంతో కొట్లాడుతుందో తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుంది. మన నీళ్లు మనకు దక్కాలంటే రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమన్న జయశంకర్ సార్​ ఆలోచనలను మన పాలకులు ఆచరణలో పెట్టిందెక్కడ? పోతిరెడ్డిపాడుకు మరో పొక్క పెట్టిన ఆంధ్రా ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు నదీ జలాల విషయమై పార్లమెంట్​లో గగ్గోలు పెడుతున్నా.. తెలంగాణ సీఎం, ఎంపీలు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటి?

ప్రతి పైసా ప్రజలకు దక్కేలా కాపలా ఉండాలె

తెలంగాణ ఏర్పాటుతోనే కర్తవ్యం ముగిసిపోదని, కొత్త రాష్ట్రంలోని ‘సంపద’ ప్రతి పౌరునికి అందేలా పౌర సమాజం వాచ్ డాగ్ లా పనిచేయాలని జయశంకర్ సార్​ సూచించారు. జయశంకర్ సార్​ జయంతిని జరుపుకోవడం అంటే తెలంగాణ సంపద దుర్వినియోగం కాకుండా ప్రజలకు దక్కేలా కోట్లాడ్డం. జయశంకర్ సార్​ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అంటే కృష్ణా, గోదావరి జలాల్లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి మన వాటాను మనం సాధించుకోవడం. జయశంకర్ సార్​ మార్గంలో పయనించడం అంటే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం నిరుద్యోగుల పక్షాన పోరాడడం. జయశంకర్ సార్​ ఆలోచనలను కొనసాగించడం అంటే పౌర హక్కులను కాపాడుకోవడం. చివరిగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడడం. ఆ దిశగా తెలంగాణ విద్యావంతుల వేదిక తన శక్తి మేరకు కృషి చేస్తుంది.

జయశంకర్ సార్​ ఆశించిన ఉపాధి ఏది?

నియామకాల విషయంలో తెలంగాణ యువత నష్టపోతోందని, అన్ని విభాగాల్లో ఆంధ్రా వారే తిష్ట వేశారని జయశంకర్ సార్​ చెప్పారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన పోలీసు అధికారులే.. రాష్ట్రం వచ్చిన ఏడేండ్ల తర్వాత కూడా కొనసాగుతూ ప్రశ్నించే గొంతుకలను అణిచేస్తున్నారంటే స్వయం పాలనలో ఆత్మగౌరవానికి విలువెక్కడ? అనేక డిపార్ట్​మెంట్లలో సీమాంధ్ర ఉద్యోగులే కొనసాగుతున్నారంటే కొట్లాడి సాధించిన రాష్ట్రంలో యువత బతుకుకు భరోసా ఎక్కడ? ఏడేండ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వ పెద్దలు మోసపరిత లెక్కలు చెపుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉన్న ఖాళీలనే ఇప్పటికీ చెపుతూ.. ఈ ఏడేండ్లలో ఎంత మంది ఉద్యోగ విరమణ పొందారు? కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ఎంత మంది అవసరమనే లెక్కలు చెప్పడంలేదు. ఖాళీలు భర్తీ చేయడంలేదు. అదే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే ఆగమేఘాల మీద రాజకీయ నిరుద్యోగులతో భర్తీ చేస్తున్నారు. అంటే రాజకీయ పదవుల పట్ల ఉన్న శ్రద్ధ రాష్ట్రం కోసం కొట్లాడిన యువత పట్ల లేదా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు వేయించుకుని దాని గురించే మాట్లాడటం లేదు. 25 లక్షల మందికిపైగా యువత టీఎస్పీఎస్సీ వద్ద ఎన్ రోల్​ చేసుకున్నా.. లక్షల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ దిశగా అడుగులు వేయదు. ఇలా జరుగుతుందని జయశంకర్ సార్​ కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు.

నోట్లతో ఓట్లు కొనడమే ప్రజాస్వామ్యమా?

తెలంగాణను ప్రజాస్వామికరించడం అంటే నోట్ల కట్టలతో ఓట్లు కొనడమా? చైతన్యవంతమైన ప్రజలను తాయిలాల పేరుతో లొంగదీసుకోవడమా? ఎన్నికల పథకాలను తీసుకొచ్చి పోటీ చేసే ఆలోచనలకు బడుగులను దూరం చేసి ఓటు బ్యాంకుగా పరిగణించడమా? ఎన్నికలప్పుడు సంచలన ప్రకటనలు చేయడం సంక్షేమమా? ప్రశ్నించే గొంతుకలను బంధించడమా? ఇదేనా జయశంకర్ సార్​ ఆకాంక్షించిన తెలంగాణ రాష్ట్రం? అణగారిపోయిన బతుకుల్లో వెలుగులు నింపడం ద్వారా, అంధకారంలో మగ్గిపోతున్న బతుకులకు భరోసా దొరకడం ద్వారా 
‘తెలంగాణ జాతిపితగా’ పిలుచుకునే జయశంకర్ సార్​ ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని తెలంగాణ సమాజం కలలుగన్నది. కానీ ఆ వైపు అడుగులు పడడం లేదనేది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో అధికారం అనే అసహనం పాలన చేస్తోంది. తెలంగాణ ప్రజలకు ఉన్న పోరాట తత్వాన్ని నిలబెట్టుకుంటూనే సహనం పునాదులపై ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా విశ్వసిస్తోంది.

- పందుల సైదులు, 
తెలంగాణ విద్యావంతుల వేదిక