ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : కోదండరాం

ప్రజలు మార్పు కోరుకుంటున్నరు :  కోదండరాం

నకిరేకల్, వెలుగు : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనిటీజేఎస్  చైర్మన్   కోదండరాం అన్నారు. ప్రజలందరి పోరాటం, అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్  రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకొని రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిందని, సీఎం కేసీఆర్   నియంతలా రాష్ట్రాన్ని పాలించారని ఆయన మండిపడ్డారు. గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో కోదండరాం మాట్లాడారు. 

సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వంలో మార్పు తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్  మాజీ చీఫ్​  సోనియా గాంధీకి కానుకగా నేడు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, కేసీఆర్   అవినీతి, అసమర్థ, నియంత పాలనను అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్  మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు. 

ALSO READ: ఎన్నికల్లో డబ్బు పంచే వారికి ఓటేయొద్దు : విష్ణువర్ధన్ రెడ్డి

కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్  మద్దతుగా నిలవడంపై కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్  జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్  రెడ్డి, పూజర్ల శంబయ్య,  యానాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.