దసరా కానుకగా కార్మికులకు లాభాల బోనస్

దసరా కానుకగా కార్మికులకు లాభాల బోనస్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సింగరేణి కాలరీస్ కంపెనీ.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి  దాదాపు రూ. 1200 కోట్ల నుంచి రూ. 1250కోట్ల మేర లాభాలు చూపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మేరకు హైదరాబాద్​లో బుధవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఇంటర్నల్​మీటింగ్​లో ప్రకటించినట్లు సమాచారం. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ. 273కోట్లు లాభాలు రాగా,  ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడంతో వాస్తవ లాభాలు తక్కువలో తక్కువ రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్ల  దాకా వచ్చి ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికే సుమారు రూ.650 కోట్ల లాభాలను సంస్థ ఆర్జించింది. ఆరో నెల నుంచి దేశంలో బొగ్గు కొరత ఏర్పడటంతో సింగరేణి బొగ్గు దేశవ్యాప్తంగా హాట్​కేకులా అమ్ముడుపోయింది. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పవర్​ ప్రాజెక్టులకు అవిశ్రాంతంగా బొగ్గు సప్లై చేసింది. దీంతో డిసెంబర్​నాటికి అమ్మకాలు రూ.19,000 కోట్లకు, లాభాలు రూ.1,070 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. మార్చి నాటికి అమ్మకాలు(టర్నోవర్​) రూ.26వేల కోట్లకు చేరగా, లాభాలు రూ.1500 కోట్లు దాటాయనే  అంచనా ఉంది.  

ఈ ఏడాది వాటా ఎంత?

గతేడాది లాభాల్లో కార్మికులకు యాజమాన్యం 29శాతం వాటా ఇచ్చింది. ఈసారి కూడా అదే స్థాయిలో  కార్మికుల వాటా ఇస్తారా? ఇంకా పెంచుతారా? అనే విషయం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్​లో  లాభాలపై క్లారిటీ వచ్చినా,  మరో వారం రోజుల్లో లాభాలతో పాటు కార్మికుల వాటా విషయాన్ని సీఎం కేసీఆర్​ ద్వారా దసరా కానుకగా ప్రకటించేందుకు యాజమాన్యం ప్లాన్​ చేస్తోంది. కాగా, ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు ఆరు నెలలు కావస్తున్నప్పటికీ లాభాల ప్రకటన చేయకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైనందున  కార్మికులకు 35శాతం వాటా ప్రకటించాలని కార్మిక సంఘాల నాయకులు  డిమాండ్​ చేస్తున్నారు.  వాస్తవ లాభాలు రూ.1800 కోట్లకు పైగా ఉన్నాయని, వాటిని ప్రకటించకుండా కార్మికుల పొట్ట కొడ్తే చూస్తూ ఊరుకోమని  బీకేఎంఎస్(బీఎంఎస్) జాతీయ కార్యదర్శి పి. మాధవ్​నాయక్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య  చెప్పారు.