ఐటీలో ఉద్యోగాలకు కోత తప్పదు

ఐటీలో ఉద్యోగాలకు కోత తప్పదు

హైదరాబాద్, వెలుగు: లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇండియా ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు కోత తప్పదని నాస్కామ్‌‌ మాజీ ప్రెసిడెంట్‌‌ ఆర్‌‌.చంద్రశేఖర్‌‌ అన్నారు.  వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానం మంచిదేనని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని చెప్పారు. దీనివల్ల ఐటీ కంపెనీల ఖర్చులు తగ్గుతాయని అన్నారు. వెంచర్‌‌ క్యాపిటలిస్టుల ఇన్వెస్ట్‌‌మెంట్లపై ఆధారపడే స్టార్టప్‌‌లకూ ఇబ్బందులు తప్పవని చంద్రశేఖర్‌‌ స్పష్టం చేశారు. తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమూ వాటికి కష్టతరంగా మారొచ్చని తెలిపారు. ‘‘పెద్ద కంపెనీల్లో మాత్రం జాబ్‌‌ కట్స్‌‌ ఉండకపోవచ్చు. జీతాలు చెల్లించడానికి వాటి దగ్గర తగినంత డబ్బు ఉంటుంది. ఒకవేళ తీసేస్తే టెంపరరీ, ఇంటర్నీలపై వేటు వేయొచ్చు. అయితే లాక్‌‌డౌన్‌‌ రెండు మూడు నెలలు కొనసాగితే మాత్రం పెద్ద కంపెనీలూ జాబ్‌‌ కట్స్‌‌కు మొగ్గుచూపుతాయి. లాక్‌‌డౌన్‌‌ ఎంత కాలం ఉంటుందన్నదనే అతి ముఖ్యమైన ప్రశ్న!’’ అని చంద్రశేఖర్‌‌ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు ఇచ్చేవి కూడా వర్క్​ ఫ్రమ్​ హోం విధానానికి అడ్డు చెప్పకపోవచ్చని అన్నారు. నాస్కామ్‌‌ మరో మాజీ ప్రెసిడెంట్‌‌ బీవీఆర్‌‌ మోహన్‌‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతున్నందున, జాబ్‌‌ కట్స్‌‌పై ఇప్పటికిప్పుడు స్పష్టంగా ఏమీ చెప్పలేమని తెలిపారు.