ఎములాడ రాజన్నకు 400 కోట్లు ఏమాయె?..హామీ ఇచ్చి 8 ఏండ్లాయే

ఎములాడ రాజన్నకు 400 కోట్లు ఏమాయె?..హామీ ఇచ్చి 8 ఏండ్లాయే
  • 8 ఏండ్ల కిందే ప్రకటించిన సీఎం కేసీఆర్​
  • ఇన్నేండ్లుగా ఫండ్స్​ రాలే.. మాస్టర్​ ప్లాన్​ అమలుకాలే..
  • ఎప్పట్లాగే కష్టాలు పడ్తున్న భక్తులు
  • కొత్తగా కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం హామీపైనా అనుమానాలు

వేములవాడ/కొండగట్టు, వెలుగు: వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన సీఎం కేసీఆర్, తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తామని జగిత్యాలలో ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. 2015లో వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేసీఆర్, ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం నాలుగేండ్లపాటు బడ్జెట్​లో రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తామని ఘనంగా ప్రకటించారు. ఇది జరిగి ఇప్పటికి ఎనిమిదిన్నరేండ్లు గడిచిపోయాయి. 9బడ్జెట్లు పెట్టినా వేములవాడకు పైసా కేటాయించ లేదు. దీంతో వేములవాడ మాస్టర్ ప్లాన్ మధ్యలోనే ఆగిపోయి, ఎప్పట్లాగే భక్తులు కష్టాలు పడ్తున్నారు. ఇటు ఐదేండ్లుగా సర్కారు నిర్లక్ష్యంతో కొండగట్టు మాస్టర్ ప్లాన్​కు అతీగతి లేకుండా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ రెండు పుణ్యక్షేత్రాలు భక్తులకు రెండు కండ్ల లాంటివి. మొదట ఎములాడ రాజన్నను దర్శించుకున్నాకే కొండగట్టుకు రావడం ఆనవాయితీ. కానీ వేములవాడలో మాటతప్పిన సీఎం, కొండగట్టుకు కొత్త హామీ ఇవ్వడంతో దీనినైనా నెరవేరుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

2015, జూన్​లో సీఎం హోదాలో హామీ​

సీఎం హోదాలో తొలిసారి 2015 జూన్ 18న వేములవాడ రాజన్నను కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే రోడ్లను విస్తరించాలని, ఆలయం చుట్టూ 1000 మీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలను పడగొట్టించాలన్నారు. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ(వీటీడీఏ) ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతి సూచనలతో ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాజన్న గుడి చెరువు కట్టను 150 ఫీట్ల వెడల్పుతో ట్యాంక్​బండ్​గా డెవలప్ చేసి, చుట్టూ పార్కులు, చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మూలవాగుపై రెండు బ్రిడ్జిలతో పాటు నాంపల్లిగుట్టను కూడా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం తక్షణమే రూ.50 కోట్లు, ప్రతి యేటా బడ్జెట్ రూ.100 కోట్ల చొప్పున నాలుగేండ్లపాటు రూ.400 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సీఎం హామీలిచ్చి ఎనిమిదేండ్లు గడిచిపోయాయి. మధ్యలో 9బడ్జెట్​లు పెట్టారు. కానీ, ఏ ఒక్క బడ్జెట్​లోనూ వేములవాడకు పైసా కేటాయించ లేదు. గడిచిన ఎనిమిదేండ్లలో తక్షణమే రిలీజ్ చేస్తామన్న రూ.50 కోట్లు రాగా, ఆ మొత్తంతో మూలవాగు మీద వంతెన తప్ప ఇతరత్రా ఏ డెవలప్​మెంట్​చేయలేదు. పైగా ఏటా రూ.100 కోట్ల చొప్పున రాజన్నకు వస్తున్న ఆదాయాన్ని దేవాదాయశాఖ ద్వారా సర్కారే ఉల్టా తన ఖాతాలో వేసుకుంటున్నది.

కొండగట్టులో పత్తాలేని మాస్టర్ ప్లాన్

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద హనుమాన్ టెంపుల్​గా గుర్తింపు పొందిన కొండగట్టు అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు 8 ఏండ్లలో ఇచ్చింది అక్షరాలా సున్నా. సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ఐదేండ్ల కిందే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. సర్కారు ఆదేశాలతో 2018లోనే అప్పటి కలెక్టర్​ 333.3 ఎకరాల రెవెన్యూ భూములను టెంపుల్​కు కేటాయించారు. కానీ, మాస్టర్ ప్లాన్ నేటికీ కాగితాలను దాటలేదు. మాస్టర్ ప్లాన్​లో ఆలయ విస్తరణతో పాటు, రోప్​వే, ఘాట్​రోడ్ల నిర్మాణం, మెట్ల దారి ఆధునీకరణ లాంటివి ఉన్నాయి. వాస్తవానికి మాస్టర్ ప్లాన్​కు ముందే కొండగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టపైకి రోప్ వే నిర్మాణం కోసం  ప్రపోజల్స్ రెడీ చేసింది. కానీ, ఫండ్స్ లేక పనులు ప్రారంభం కాలేదు. మెట్ల దారి ఆధునీకరణ కోసం రూ.2.5 కోట్ల అంచనాతో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. అద్దె గదులు లేక భక్తులు చెట్ల కిందే ఉంటున్నారు. 

మాల విరమణ మండపం లేకపాయే..

కొండగట్టుకు వచ్చే హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేయడానికి ఇప్పటి దాకా మండపం నిర్మించలేదు. దీంతో కల్యాణ కట్టలోనే మాల విరమణ చేస్తుండడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో రూ.2.5 కోట్లతో కొత్త కోనేరు నిర్మించారు. కానీ, కేవలం హనుమాన్ జయంతి టైంలో మాత్రమే నీటితో నింపుతున్నారు. 2018, సెప్టెబర్​ 12న కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో65 మందికి పైగా మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. ఇక్కడ ప్రమాదాలు మూలమలుపుల వల్లే జరుగుతున్నాయని తేల్చారు. కానీ, ఘాట్ రోడ్డును డెవలప్ చేయకుండానే ఎప్పట్లాగే వెహికల్స్​ అనుమతిస్తుండడంతో భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అంజన్నను దర్శించుకుంటున్నారు.

ఎక్కడి పనులు అక్కడే.. 

రాజన్న గుడి చెరువు169 ఎకరాలు ఉండగా, మరో 35ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని సేకరించి, లెవల్ చేసి వదిలేశారు. ఇందులో 35 ఎకరాల్లో శివ కల్యాణ మండపం, రామ కల్యాణ మండపం, కల్యాణ కట్ట, వేద, నృత్య పాఠశాల, మధ్యలో చెరువు, అందులో నటరాజ్ విగ్రహం, పక్కన అన్నదాన భవనం, ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ చేయలేదు.  చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ జాడలేదు. ధర్మగుండం ఆధునీకరణ, భక్తుల వసతి కోసం కాటేజీలు, నాంపల్లి గుట్టపై ధ్యాన మందిరం, ఘాట్ రోడ్డు నిర్మాణం, ప్లానిటోరియం, పనోరమ వ్యూ, రోప్ వే.. ఇలా అన్ని హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. రోడ్లను విస్తరించకపోవడంతో ప్రతీ సోమవారం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక శివరాత్రి, శ్రీరామనవమి, సమ్మక్క, ఇతర జాతరల సమయాల్లో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటోంది. క్యూలైన్లు విస్తరించకపోవడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఎములాడలో ప్రస్తుతం ఉన్న 550 వసతి గదులు ఏమూలకూ సాల్తలేవు. అవి కూడా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.