సరైన పైపులు వాడలేదు.. అందుకే పగుల్తున్నయ్: వివేక్

సరైన పైపులు వాడలేదు.. అందుకే పగుల్తున్నయ్: వివేక్
  • నీళ్లందక 30వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
  • కేసీఆర్.. రైతుల్ని ముంచి కాంట్రాక్టర్లకు పంచిండు
  • ఎస్సారెస్పీ, కడెం నుంచి నీళ్లివ్వాలని డిమాండ్

దండేపల్లి/ బెల్లంపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ రైతులను కోటీశ్వరులను చేస్తానని తన కుటుంబసభ్యులను, కాంట్రాక్టర్లను కోటీశ్వరులుగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి విమర్శించారు. శనివారం ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రంగంపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో పర్యటించారు. రంగంపల్లి వద్ద పగిలిన గూడెం లిఫ్ట్ పైపులైన్, నీళ్లు రాక ఎండుతున్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మేఘా కంపెనీ గూడెం లిఫ్ట్ పైపులైన్ పనులను నాసిరకంగా చేసిందని ఆరోపించారు. ఎమ్మెస్ పైపులకు బదులు నాసిరకమైన జీఆర్పీ పైపులు వేయడం వల్ల తరచూ పగిలిపోయి పంటలకు నీళ్లు అందడం లేదన్నారు. మంత్రి హరీశ్​రావు పైపులైన్​ను మారుస్తామని అసెంబ్లీలో చెప్పి నాలుగేండ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి, హజీపూర్ మండలాల్లో 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గూడెం లిఫ్ట్ పైపులైన్ మార్చాలన్నారు. ఎండుతున్న పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీలో 150 మంది యువకుల చేరిక

బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన చేరికల సభకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగారాం నగర్, కన్నాల, సుభాష్​నగర్, గాంధీనగర్ కు చెందిన 150 మంది యువకులు పార్టీలో చేరారు. వివేక్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ దందా నడుస్తోంది

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో ఇరిగేషన్ దందా నడుస్తోందని, కమీషన్లు దండుకునేందుకే ప్రాజెక్ట్ లు కడుతున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల వేల ఎకరాల్లో పచ్చని పంటలు ముంపునకు గురై రైతులు రోడ్డున పడ్డారన్నారు. శనివారం కాగజ్ నగర్ లోని సర్ సిల్క్ కాలనీలో బీజేపీ నేత పాల్వాయి హరీశ్ బాబు నూతన గృహప్రవేశంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తో కలిసి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి పాలన సాగిస్తున్నారని, ప్రజలు మార్పు కోరుతున్నారని తెలిపారు. బీజేపీ అన్ని వర్గాల పార్టీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో  సిర్పూర్ టీ నియోజకవర్గంలో బీజేపీ జండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, రఘునాథ్, సుదర్శన్ గౌడ్, వీరభద్ర చారి, అత్మారం నాయక్, సిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఖేల్ ఖతం

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగుచెందారని వివేక్ వెంకటస్వామి అన్నారు. చంద్రవెల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేసేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బీజేపీ కార్నర్ సమావేశాలు జరుగుతాయని, 10లోగా శక్తి కేంద్రాల సమావేశాలు పూర్తి చేయాలని నాయకులను వివేక్ ఆదేశించారు. వెరబెల్లి రఘునాథ్​రావు మాట్లాడుతూ పోలింగ్ బూత్​ల వారీగా కమిటీలతో పార్టీ మండల అధ్యక్షులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కోరారు. సమావేశంలో గజెల్లి రాజ్​కుమార్, రాచర్ల సంతోష్, సుదర్శన్​గౌడ్, మునిమంద రమేశ్, బొమ్మెన హరీశ్​గౌడ్, అందుగుల శ్రీనివాస్, చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు, గోపతి రాజయ్య 
తదితరులు పాల్గొన్నారు.