గద్వాల పట్టణ శివారులోని కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు!

గద్వాల పట్టణ శివారులోని  కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు!
  •     బ్రోకర్లు, రెవెన్యూ ఆఫీసర్ల కుమ్మక్కు
  •     2006లో సేల్ డీడ్​ ద్వారా అమ్మేసి, ఇప్పుడు విరాసత్  చేసుకున్నరు
  •     గతంలోనూ డిజిటల్ కీ మిస్ యూస్
  •     ఈ స్థలంపై 2008 నుంచి వివాదమే
  •     ఆందోళనలో ప్లాట్లు కొన్న 273 మంది బాధితులు

గద్వాల, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్లు, బ్రోకర్లు కుమ్మక్కై కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు. గద్వాల పట్టణ శివారులోని సర్వే నంబర్ 868లో 16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్మారు. ఇందులో నాలుగు ఎకరాలు అప్పటి ఓనర్  శారద సేల్  కం జనరల్  పవర్  ఆఫ్  అటార్నీతో ఖలీల్, సలీంకు విక్రయించారు. 

ఆ సేల్  డీడ్​తోనే ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇలా ప్లాట్లు చేసి అమ్మేసిన భూమిని ఇప్పుడు విరాసత్  చేయడం కలకలం రేపుతోంది. ఇదే భూమిని కొట్టేసేందుకు ఔట్​ సోర్సింగ్  ఎంప్లాయిస్  డిజిటల్  కీని మిస్  యూస్​ చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ భూమిని బ్లాక్  లిస్ట్ లో పెట్టగా, గుట్టు చప్పుడు కాకుండా రీ ఓపెన్  చేసి విరాసత్  చేశారు. దీంతో ఆ స్థలంలో ప్లాట్లు కొన్న 273 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు.

16 ఎకరాల్లో ప్లాట్లు..

గద్వాల పట్టణ శివారులోని సర్వే నంబర్  868లో 16 ఎకరాల భూమి ఉంది. 868/ ఏలో అబ్దుల్లా పేరుపై ఎకరా, ఖాజా హుస్సేన్  పేరుపై 2.20 ఎకరాలు, హుస్సేన్ బీ పేరుపై ఎకరా, బాబు సాబ్ కు 1.10 ఎకరాలు, ఉస్మాన్ సాబ్  పేరుపై 1.10 ఎకరాలు, ఖాజా హుస్సేన్  పేరుపై 868/సిలో నాలుగు ఎకరాలు, శారద పేరుపై 868/బిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ 16 ఎకరాల భూమిలో 2008 నుంచి 2010 మధ్య ప్లాట్లు చేసి విక్రయించారు.

నాలుగు ఎకరాల్లో సేల్  డీడ్​తో అమ్మకాలు..

శారద పేరుపై 868/బిలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని 9/2005 సేల్  కం జనరల్  పవర్  ఆఫ్  అటార్నీ చేసుకొని 20/6/2005లో ఖలీల్, సలీం ప్లాట్లుగా మార్చి శారద ఏజెంట్లుగా ఉంటూ అమ్మారు. ఈ ప్లాట్లు కొన్నవారిలో కొందరు ఎల్ఆర్ఎస్  కట్టుకోగా, మరికొందరు ఇండ్ల కోసం పర్మిషన్లు తీసుకున్నారు. టీ పాస్​ ద్వారా పర్మిషన్లు తీసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టారు.

గతంలో డిజిటల్  కీ మిస్ యూస్..

2010 వరకు ప్లాట్ల అమ్మకాలు జరగగా, ఆ తర్వాత ధరణి పోర్టల్  రావడం, అందులో గతంలో ఉన్న ల్యాండ్  ఓనర్  పేరు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపించింది. దీంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. 2017లో కలెక్టరేట్ లోని కొందరు ఆఫీసర్లు, కాంటాక్ట్  ఎంప్లాయిస్  కుమ్మక్కై డిజిటల్  కీని మిస్ యూస్​ చేసి పాస్ బుక్ రిలీజ్  చేశారు. 

దీనిపై అప్పట్లో బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో అవుట్​సోర్సింగ్  ఎంప్లాయిస్ తో పాటు పాస్ బుక్ తీసుకున్న వారిపై ఎఫ్ఐఆర్  నమోదైంది. వెంటనే రెవెన్యూ ఆఫీసర్లు స్పందించి ఆ సర్వే నంబర్లను బ్లాక్  లిస్ట్​లో చేర్చారు.

గుట్టు చప్పుడు కాకుండా విరాసత్..

గద్వాల తహసీల్దార్  కేంద్రంగా బ్లాక్ లిస్ట్​లో ఉన్న 868/బి సర్వే నంబర్ ను రీ ఓపెన్  చేశారు. 10 రోజుల కింద గుట్టు చప్పుడు కాకుండా ఆ సర్వే నంబర్ లోని నాలుగు ఎకరాల భూమిని శారద వారసులకు విరాసత్  చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సర్వే నంబర్ ను ఎలా విరాసత్  చేశారని ఈ స్థలంలో ప్లాట్లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు డబ్బులు దండుకొని తమకు అన్యాయం చేస్తున్నారని  వాపోతున్నారు.

ల్యాండ్  ఓనర్   ఎవరో ఎంక్వైరీ చేస్తాం

బ్లాక్ లిస్ట్​లో ఉన్న సర్వే నంబర్ ను విరాసత్  చేసిన వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తాం. ఆ సర్వే నంబర్ కు సంబంధించిన ల్యాండ్  ఓనర్  ఎవరనేది గుర్తిస్తాం. తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాట్లు కొన్నవారికి అన్యాయం జరగనివ్వం. - లక్ష్మీనారాయణ, అడిషనల్  కలెక్టర్, గద్వాల