- డిజిటల్ బ్రోకర్లకు బెనిఫిట్
ముంబై: ఇండెక్స్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్వేళలను పొడిగించాలనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) ప్రపోజల్ బ్రోకింగ్వర్గాలలో కొంత అయోమయం కలిగిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఒక ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలనేది ఎన్ఎస్ఈ ఆలోచన. ఈ ప్రపోజల్‌ను సెబీ అనుమతి కోసం పంపించారు. ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రపోజల్ తమ ఆదాయ, వ్యయాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుందనే అంశంపై బ్రోకింగ్ ఇండస్ట్రీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.
సాయంత్రపు ట్రేడింగ్ సెషన్ కోసం ఆపరేషన్స్ టీమ్‌ను కొత్తగా నియమించుకోవల్సి వస్తుందని, ఫలితంగా అదనపు ఖర్చు తప్పదని చాలా మంది చెబుతున్నారు. సాయంత్రపు ఆపరేషన్స్ కోసం 20–30 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి చెప్పారు. చిన్న బ్రోకర్లు సైతం తమ కస్టమర్ల అవసరాలను నెరవేర్చాలంటే ఎంతో కొంత మంది కొత్త ఉద్యోగులను యాడ్ చేసుకోవాల్సి వస్తుంది.
అదనపు ఖర్చు..
ట్రేడింగ్ వేళల పెంపు వల్ల బ్రోకింగ్ ఇండస్ట్రీ ఖర్చులు డిస్కౌంట్ బ్రోకర్లకైతే 5–7 శాతం, కాల్ అండ్ ట్రేడ్ (ట్రెడిషనల్) బ్రోకర్లకైతే 10–15 శాతం దాకా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు షిఫ్టులలో పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, స్టాక్ బ్రోకింగ్ కూడా మాన్యుఫాక్చరింగ్ సెటప్ తరహాలోకి మారిపోతోందని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ట్రేడ్‌జీనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ త్రివేష్ చెప్పారు. ఎన్ఎస్ఈ ప్రపోజల్‌కు సెబీ ఓకే చెబితే, కనీసం 5 నుంచి 10 శాతం ఉద్యోగులను పెంచుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
బ్రాంచీల పరిస్థితి..
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓశ్వాల్ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్తోపాటు ఇతర ట్రెడిషనల్ బ్రోకర్లు పట్టణాలు, చిన్న సిటీలలోని బ్రాంచీలలో అదనపు ఉద్యోగుల అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నాయి. బ్రాంచీలలో క్లయింట్లకు రీసెర్చ్, రికమెండేషన్స్విషయంలో హెల్ప్ చేయడానికి రిలేషన్షిప్ మేనేజర్లు మాకు ఉన్నారు. వారు మ్యూచువల్ ఫండ్స్ ప్రొడక్టులను కూడా అమ్ముతారు. మా కస్టమర్లలో 92 శాతం మంది డిజిటల్‌గానే ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ రెల్లి వివరించారు. పై కారణాల వల్ల బ్రాంచీలలో అదనపు ఉద్యోగుల అవసరం రాదని ఆయన చెప్పారు.
కొన్ని సందేహాలు..
ఈవెనింగ్ సెషన్స్ ట్రేడింగ్ఆపరేషన్స్ నిర్వహణకు సంబంధించిన వివరాల వెల్లడి కోసం ఎదురు చూస్తున్నానని కొత్త తరపు బ్రోకింగ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. క్లయింట్ల ఫండ్స్‌ను సాయంత్రం ఆరు గంటలలోపు ప్రస్తుతం బ్రోకర్లు అప్‌స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ కటాఫ్ టైము మార్పుతోపాటు, సెటిల్మెంట్ రిక్వైర్మెంట్ ఛేంజ్కూడా ఉంటుంది. ఈవెనింగ్ సెషన్స్ మొదలయ్యాక ఈ మార్పులు ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో తెలవాల్సి ఉందని పేర్కొన్నారు.
రోజువారీ సెటిల్మెంట్ ప్రాసెస్‌ను ఈవెనింగ్ ట్రేడింగ్ సెషన్ తర్వాత అంటే రాత్రి 9 తర్వాత చేయాలని రెగ్యులేటర్ ఆదేశిస్తే, బ్రోకర్లు కొంత అదనంగానే కష్టపడాల్సి వస్తుందని ఆయన వివరించారు.