‘స్మార్ట్ సిటీ’ పనులు పూర్తి కాలె.. మరోసారి పొరపాట్లు చేయొద్దంటున్న వరంగల్ సిటీ జనాలు

‘స్మార్ట్ సిటీ’ పనులు పూర్తి కాలె.. మరోసారి పొరపాట్లు చేయొద్దంటున్న వరంగల్ సిటీ జనాలు
  • ‘సాస్కీ’ ముందుకు పడ్తలె ! 
  • వరంగల్ సిటీ అభివృద్ధి పనులపై సాగదీత
  • నాలుగు నెలల నుంచి బిజీగా ఉన్న ఆఫీసర్లు  
  • ప్రపోజల్స్ పంపేందుకు సమీపిస్తున్న గడువు 
  • త్వరగా పంపితే కేంద్రం నుంచి రూ.200 కోట్ల నిధులు  
  • సరైన పర్యవేక్షణ లేక గడువు తీరినా పూర్తికాని స్మార్ట్ సిటీ  
  • ఆ ప్రాజెక్ట్ చూసే ఆఫీసర్ల చేతిలోనే ‘సాస్కీ ’ ప్రపోజల్స్ తయారు 
  • మరోసారి పొరపాట్లు చేయొద్దంటున్న వరంగల్ సిటీ జనాలు

వరంగల్‍, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ‘సాస్కీ స్కీమ్’ కింద ఇచ్చే నిధులకు సంబంధించి 2025–--26 సంవత్సరానికి గ్రేటర్‍ వరంగల్‍ సిటీ అభివృద్ధి పనులపై ప్రపోజల్స్ ఇంకా తయారు చేయలేదు. గత నాలుగు నెలలుగా జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్ సిటీ ఆఫీసర్లు ఇదే  పనిలోనే ఉన్నారు. కాగా.. వచ్చే డిసెంబర్‍ చివరినాటికి కేంద్రానికి ప్రపోజల్స్ పంపాల్సి ఉంది. కానీ గడువులోగా ప్రపోజల్స్ రూపొందించడంలో  ఆఫీసర్లు వెనకబడ్డారు. గడువు మీద గడువు పెంచినా ఇంకా సాగదీస్తూనే ఉన్నారు.

చెన్నై సిటీ తరహాలో స్పాంజ్‍ పార్కులు, వరద నీటి కాల్వల నిర్మాణం, పాత బావుల పునరుద్ధరణ, సరైన నీటి సరఫరా, సాలిడ్‍ వేస్ట్ మేనేజ్‍మెంట్‍ ప్రక్రియ, నైబర్‍ హుడ్‍ పార్కుల వంటి15 రకాల పనులకు ప్రపొజల్స్ రూపొందించాల్సి ఉన్నా ఇంకా కంప్లీట్ చేయలేదు. ‘స్మార్ట్ సిటీ’ వర్క్స్ చూసే ఆఫీసర్లే ‘సాస్కీ స్కీమ్’ ప్రతిపాదనలు రూపొందిస్తుండగా.. మేయర్‍ గుండు సుధారాణి, గ్రేటర్‍ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ పర్యవేక్షిస్తున్నారు. స్మార్ట్ సిటీ పెండింగ్‍ పనులు కూడా   డిసెంబర్‍ నాటికి పూర్తి చేయాలి.  కాగా ‘సాస్కీ స్కీమ్’ లోనూ  జాప్యం చేయకుండా  త్వరగా ప్రతిపాదనలు పూర్తి చేసి పంపాల్సిన  బాధ్యత ఆఫీసర్లపైనే ఉంది. 

రాష్ట్రానిదే ‘సాస్కీ స్కీమ్’ నిర్వహణ బాధ్యత 
దేశవ్యాప్తంగా ఐకానిక్‍ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్‍, మార్కెటింగ్‍ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్పెషల్‍ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్‍ క్యాపిటల్‍ ఇన్వెస్ట్ మెంట్ (ఎస్‍ఏఎస్‍సీఐ– సాస్కీ)’ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద ఎంపికైన సిటీలో ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍, వాటర్‍ సప్లై, రోడ్లు, హెల్త్, గ్రౌండ్‍ వాటర్‍ పెంపు, టూరిజం పార్కు లు వంటివి అభివృద్ధి చేయాలి. ఆయా పనులకు కేంద్రం 50 ఏండ్ల పాటు వడ్డీలేని రుణాలను అందిస్తుంది. ప్రాజెక్ట్ ల ఎంపిక, అమలు, నిర్వహణ బాధ్యతంతా రాష్ట్రానిదే. స్కీమ్   విధివిధానాలను కూడా గతంలోనే  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. 

రెండు విడతల్లో నిధులు విడుదల
సాస్కీ స్కీమ్ కింద కేంద్రం ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.200 కోట్లు ఇవ్వనుంది. అభివృద్ధి చేయాల్సిన  పనులకు ఆఫీసర్లు సరైన ప్రపోజల్స్ పంపితేనే  రెండు విడతల్లో నిధులు మంజూరు చేస్తుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ తరహాలోనే వర్క్స్ అప్రూవల్‍ కాగానే , తొలివిడతలో 2026 మార్చి31లోపు నిధులు విడుదల చేయనుంది.  పనులపై యుటిలైజేషన్‍ సర్టిఫికెట్లు సమర్పించాక మిగతా ఫండ్స్ రిలీజ్‍ చేసేలా కేంద్రం స్కీమ్ రూపకల్పన చేసింది. కాగా, ప్రతిపాదిత పనులను గరిష్టంగా రెండేండ్లలోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

గతేడాది రాష్ట్రం నుంచి రెండు ప్రాంతాలు ఎంపిక
దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి సాస్కీ స్కీమ్ కింద రాష్ట్రం నుంచి రెండు ప్రాజెక్ట్ లకు కేంద్రం అప్రూవల్ ఇచ్చి నిధులు విడుదల చేసింది. ఇందులో ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ పర్యాటక సర్క్యూట్‍ కు రూ.73.74 కోట్లు, నల్లమలలోని సోమశిల వెల్‍నెస్‍తో పాటు ఆధ్యాత్మిక విహారయాత్ర అభివృద్ధికి రూ.68.10 కోట్లు మంజూరు చేసింది.