కేసీఆర్​ మహబూబ్​నగర్​ పర్యటనలో వెల్లువెత్తిన నిరసనలు

 కేసీఆర్​ మహబూబ్​నగర్​ పర్యటనలో వెల్లువెత్తిన నిరసనలు

మహబూబ్​నగర్​, వెలుగు: సీఎం కేసీఆర్​ మహబూబ్​నగర్​ పర్యటనలో నిరసనలు వెలువెత్తాయి. ఆదివారం సాయంత్రం సభలో సీఎం ప్రసంగిస్తుండగా.. 2017 టీఆర్​టీలో మిగిలిపోయిన ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను మెరిట్​ వాళ్లతో భర్తీ చేయాలని అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు పది నిమిషాల పాటు వీరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి.. వారి చేతులో ఉన్న ప్లకార్డులను గుంజుకున్నారు. మధ్యాహ్నం జడ్చర్ల మీదుగా సీఎం కాన్వాయ్​ వస్తుండగా.. జడ్చర్ల బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో ప్లకార్డులు ప్రదర్శించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా పోలీసులు బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లను ముందస్తు అరెస్టులు చేశారు. ఆదివారం కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారిని, మరికొందరు లీడర్లను అరెస్టు చేసి జడ్చర్ల లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. జిల్లా కేంద్రంలో  సీఐటీయూ లీడర్​ కురుమూర్తిని, మరికొందరిని ముందస్తు అరెస్టు చేశారు.