అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శనివారం బీహార్ బంద్‌

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శనివారం బీహార్ బంద్‌

పాట్నా : కేంద్రం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానం అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు తీవ్ర స్థాయిలో ప్రారంభమైన బీహార్‌లో శనివారం (జూన్ 18న) బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిక్షమైన రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) ఈ బంద్‌కు మద్దతు తెలిపింది. బంద్‌ ప్రధానంగా ప్రజా రవాణాపై ప్రభావం చూపనుంది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశముంది. 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీ కారణమని బీజేపీ నేత, బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆ పార్టీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొనే వారిలో విద్యార్థులు కాని వారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సాయుధ బలగాల కోసం తెచ్చిన కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ అగ్నిపథ్‌ను సమర్థించారు. నాలుగేళ్ల తర్వాత డిశ్చార్జ్ అయిన యువకులు కొత్త ఉద్యోగాలు పొందడంలో నైపుణ్యం కలిగి ఉంటారని అన్నారు.