అలాంటి యాడ్ ఎలా చేస్తారు సచిన్: మాస్టర్‌కు నిరసన సెగ

అలాంటి యాడ్ ఎలా చేస్తారు సచిన్: మాస్టర్‌కు నిరసన సెగ

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు నిరసన సెగ ఎదురైంది. ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాడ్ చేయడమే అందుకు కారణం. దీనిని వ్యతిరేకిస్తూ ముంబై, బాంద్రాలోని ఆయన ఇంటి ముందు పలువురు నిరసనకారులు ఆందోళన చేశారు. భారత రత్న గ్రహీత అయిన సచిన్.. గేమింగ్ సంస్థను ప్రమోట్ చేయడం సరికాదని, వెంటనే ఈ యాడ్ నుంచి ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అసలు ఈ వివాదమేంటంటే..?

ఇటీవల సచిన్.. పేటీఎం ఫస్ట్ గేమ్ కోసం ఒక యాడ్ చేశారు. వాస్తవానికి ఇదొక గేమింగ్ యాప్. దీని ద్వారా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించే/పోగొట్టుకునే వీలుంటుంది. వీటిని ఫాంటసీ గేమ్‌లు అని పిలుస్తున్నప్పటికీ.. ఒకరకంగా ఇది కూడా జూదమే. అందువల్లే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

బాంద్రాలోని సచిన్ ఇంటి ముందు మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావ్ (బచ్చు కాడు), అతని అనుచరులు ఆందోళనకు దిగారు. యువతను వ్యసనపరులు చేసే ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్ యాడ్ నుంచి సచిన్ వెంటనే తప్పుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ సచిన్ భారతరత్న గ్రహీత కాకపోయుంటే.. తాము ఇలాంటి ఆందోళన చేయాల్సివచ్చేది కాదని వారు తెలిపారు. ఇలాంటి యాడ్స్ ద్వారా సచిన్ డబ్బు సంపాదించాలనుకుంటే భారతరత్న వెనక్కి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఒకసారి నోటీస్ పంపామని.. దీనిపై సచిన్ స్పందించలేదు కావున మరోసారి అతనికి లాయర్ ద్వారా నోటీసు పంపనున్నట్లు సదరు ఆందళనకారులు తెలిపారు. దీనిపై ఇప్పటి వరకూ సచిన్ స్పందించకపోగా.. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, 2013లో క్రికెట్ నుంచి రిటైరైన సచిన్ ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించిన విషయం తెలిసిందే. అంతేకాదు సచిన్.. రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు.