పార్లమెంట్, ఏఐసీసీ ఆఫీస్ వద్ద నిరసనలు

పార్లమెంట్, ఏఐసీసీ ఆఫీస్ వద్ద నిరసనలు
  • పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌‌‌‌ నుంచి రాష్ట్రపతి భవన్‌‌‌‌కు ర్యాలీగా వెళ్లే యత్నం
  • రాహుల్ సహా ఎంపీలను అడ్డుకున్న పోలీసులు.. వెహికల్స్‌‌‌‌లో తరలింపు
  •  దేశవ్యాప్తంగా పార్టీ  ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ రోడ్డెక్కింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టింది. నల్ల బట్టలు వేసుకుని హస్తం పార్టీ లీడర్లు నిరసనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో పార్లమెంట్, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎంపీలు, లీడర్లు ఆందోళనలు చేశారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌‌‌‌లో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు నిరసనలకు దిగారు. రాష్ట్రపతి భవన్‌‌‌‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పార్లమెంటు గేట్ నంబర్ 1 దగ్గర బ్యానర్ పట్టుకుని మహిళా ఎంపీలతో కలిసి సోనియా గాంధీ నిలబడ్డారు. సోనియా మినహా మిగతా వారందరూ రాష్ట్రపతి భవన్‌‌‌‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. విజయ్ చౌక్‌‌‌‌ వద్ద అడ్డుకున్నారు. రాహుల్‌‌‌‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, గౌరవ్ గొగోయ్ సహా మొత్తం 64 మంది ఎంపీలను విజయ్ చౌక్‌‌‌‌ నుంచి పోలీస్ బస్‌‌‌‌లో తరలించారు. విజయ్ చౌక్ వద్ద మీడియాతో మాట్లాడిన రాహుల్.. ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. నిరసన సందర్భంగా పార్టీ ఎంపీల్లో కొందరిని పోలీసులు కొట్టారని ఆరోపించారు. తర్వాత విజయ్ చౌక్‌‌‌‌ వద్ద నిరసనల ఫొటోలను ట్వీట్ చేసిన రాహుల్.. ‘ప్రజాస్వామ్యం ఓ జ్ఞాపకం’ అని పేర్కొన్నారు. 

హిట్లర్ కూడా గెలిచేటోడు: రాహుల్

ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిపై, నియంతృత్వానికి వ్యతిరేకించిన వారిపై దుర్మార్గంగా దాడి చేస్తారని, జైలులో పెడతారని రాహుల్ ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం కోసం, మత సామరస్యం కోసం గాంధీ ఫ్యామిలీ పోరాడుతున్నదని, అందుకే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస వంటి ప్రజా సమస్యలపై గొంతెత్తకూడదన్నదే ప్రభుత్వ ఎజెండా అని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యంలేదని, నలుగురు వ్యక్తుల నియంతృత్వం మాత్రమే ఉందన్నారు. ‘‘మనం చూస్తున్నది ప్రజాస్వామ్య మరణమే. దాదాపు 100 ఏండ్ల నుంచి ఇటుకపై ఇటుక పేర్చి దేశాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు మన కండ్ల ముందే దేశం నాశనం అవుతున్నది” అని అన్నారు. ప్రజాస్వామ్యమనేది ఇప్పుడు కేవలం ఓ జ్ఞాపకం మాత్రమేనని అన్నారు. ‘‘నేను నిజమే మాట్లాడుతాను. దేనికీ భయపడను. ధరల పెరుగుదలపై గొంతెత్తుతాను. అలాగే నాపై మరిన్ని దాడులు జరుగుతాయి. కానీ నన్ను బెదిరించాలని అనుకునే వాళ్లు భయపడుతారు” అని అన్నారు. తాము ఎన్నికల్లో గెలుస్తున్నామన్న బీజేపీ వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు. ‘‘హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. మొత్తం వ్యవస్థ అంతా అతడి చేతుల్లో ఉండేది. వ్యవస్థలపై అధికారాన్ని నాకివ్వండి.. ఎన్నికల్లో గెలవడమెలాగో నేను చూపిస్తా” అని అన్నారు.

బారికేడ్లు దూకి వెళ్లిన ప్రియాంక

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రియాంకా గాంధీ ధర్నా చేశారు. బారికేడ్లను దూకి మరీ వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. జంతర్ మంతర్ తప్ప న్యూఢిల్లీలో ఎక్కడా నిరసనలు తెలిపేందుకు అనుమతిలేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రియాంకను పోలీసులు కోరారు. తర్వాత బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. వెహికల్‌‌‌‌లో రికార్డు చేసిన వీడియోను మీడియాకు రిలీజ్ చేసిన ప్రియాంక.. ‘‘అధికార బలంతో మమ్మల్ని అణచేయగలరని వాళ్లు భావిస్తున్నారు. వారి మంత్రులు ధరల పెరుగుదలను చూడలేరు. అందుకే మేం ప్రధాని ఇంటికి నడిచి వెళ్లి అధిక ద్రవ్యోల్బణాన్ని ఆయనకు చూపించాలనుకుంటున్నాం’’ అని అన్నారు. ‘‘మోడీకి ద్రవ్యోల్బణం అంటూ ఏదీ లేదు. కొందరు మాత్రమే అత్యంత ధనికులయ్యారు. సాధారణ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పిండి, బియ్యం, గ్యాస్.. ఇలా ప్రతీది ఖరీదయ్యాయి” అని చెప్పారు.