
లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలపడం.. ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. అయితే వ్యవసాయ చట్టాల రద్దుతో సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయిందని అనుకోవద్దని చెప్పారు. ఏడాది కాలంలో రైతులకు జరిగిన నష్టంపైనా చర్చ జరగాలన్నారు. అగ్రి చట్టాల రద్దు బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించే వరకూ రైతు ఉద్యమం కొనసాగుతుందని, కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తికాయత్ చెప్పారు. కానీ ఎలాంటి చర్చల్లేకుండా.. తాము ఆందోళన విరమించాలని కేంద్రం కోరుకుంటోందన్నారు. కేంద్రం తమతో చర్చించే వరకు ధర్నా విరమించేది లేదన్నారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడమంటే కార్పొరేట్లకు రైతులను లూటీ చేసే స్వేచ్ఛ ఇవ్వడమేనని రాకేశ్ తికాయత్ అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను డిసెంబర్ 4 తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.