పేరు మార్చుకుని మళ్లీ వస్తోన్న పబ్జీ గేమ్

పేరు మార్చుకుని మళ్లీ వస్తోన్న పబ్జీ గేమ్
  • డేంజర్​ గేమ్​ మళ్లొస్తంది
  • బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో వచ్చే నెలలో పబ్జీ రీఎంట్రీ
  • గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటిన్నర దాటిన ప్రీ రిజిస్ట్రేషన్లు 
  • పబ్జీతో గతంలో చిన్నారులు, యువతలో మానసిక సమస్యలు
  • గేమ్ మళ్లీ వస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: చిన్నారులను, యువతను గంటల తరబడి ఫోన్లకు అడిక్ట్ అయ్యేలా చేసిన  పబ్జీ గేమ్ మరో రూపంలో దేశంలోకి త్వరలో ఎంట్రీ కాబోతుంది.  చైనా యాప్ కావడంతో కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఈ డేంజర్ గేమ్.. అవే ఫీచర్స్‌‌‌‌తో కొరియా నుంచి రాబోతుంది. క్రాఫ్టన్ అనే సంస్థ బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో  వచ్చే  నెలలో  లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  గూగుల్ ప్లే స్టోర్​లోకి ఈ యాప్​ను తీసుకురాగా.. ఇప్పటికే కోటిన్నర మంది ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ గేమ్​కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాన్ అయిందనకున్న గేమ్ మళ్లీ వస్తుందని తెలియడంతో  చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు నడవకపోవడం, కరోనా భయానికి బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పిల్లలు ఇండ్లలోనే ఉంటూ ఫోన్లతోనే టైంపాస్ చేస్తున్నారని,  పబ్జీ మళ్లీ వస్తే ఫోన్లకు అడిక్ట్ అయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనా యాప్ పబ్జీని కేంద్రం గతేడాది సెప్టెంబర్ 2న నిషేధించిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్లలో ఈ గేమ్‌‌‌‌కు బానిసలైన వాళ్లు మతిస్థిమితం కోల్పోవడం, గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పబ్జీని నిషేధించాలనే డిమాండ్ పేరేంట్స్ నుంచి వెల్లువెత్తింది. ఈ క్రమంలోనే చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం కారణంగా చైనా యాప్‌‌‌‌లను నిషేధించడంతో అందులో పబ్జీ కూడా ప్లే స్టోర్ నుంచి తోలగించారు. దీంతో పబ్జీ గేమర్లు షాక్‌‌‌‌కు గురికాగా, తల్లిదండ్రులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. 

ప్లే స్టోర్​లో పబ్జీలాంటి గేమ్​లెన్నో..  
దేశంలో పబ్జీ బ్యాన్ అయి దాని స్థానంలో  ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్, బాటిల్ ల్యాండ్స్ రాయల్, క్రియేటివ్ డిస్ట్రక్షన్, గన్స్ రాయల్, నివేస్ ఔట్, పిక్సెల్స్  అన్ నోన్ బాటిల్ గ్రౌండ్ తదితర యాప్ లెన్నో రావడంతో వీటిని డౌన్‌‌‌‌లోడ్ చేసుకుని ఆడేస్తున్నారు. మరికొందరైతే పబ్జీ యాప్‌‌‌‌ను ఇతర దేశాల వీపీఎన్ ద్వారా డౌన్‌‌‌‌లోడ్ చేసుకుని అనధికారికంగా ఆడుతున్నారు. ఇటీవల పబ్జీలో ఉన్న అన్ని ఫీచర్స్‌‌‌‌తో బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ వస్తుందని ప్రచారం కావడంతో చిన్నారులు, యువత ఈ యాప్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 

పిల్లలను కంట్రోల్ చేయలేకపోతున్నం
ఆన్​లైన్ క్లాసులు వింటారని పిల్లలకు ఫోన్లు ఇస్తే.. వాళ్లు గేమ్స్ డౌన్‌‌‌‌లోడ్ చేసుకుని ఆడుతున్నారు. ఫోన్లు లాక్కుంటే ఏడుస్తున్నారు. వాళ్లను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారుతోంది. స్కూళ్లు మూతపడడం, కరోనాతో బయట ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో పిల్లలున్న ఇంట్లో ఇదే సమస్య  ఉంది. ఇలాంటి యాప్స్‌‌‌‌ను బ్యాన్ చేస్తే బాగుంటుంది. 
- ఆనపురం లింగన్న, రామంతపూర్, హైదరాబాద్