
నగరాల్లో పెరిగిన అమ్మకాలు
3 లక్షల లోపు వాటికి డిమాండ్
డిజైర్, ఇన్నోవా హాట్ కేక్స్
టూవీలర్స్‌లో స్ప్లెండర్కు గిరాకీ
బిజినెస్ డెస్క్, వెలుగు: లాక్‌డౌన్, ఆ తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టడంతో పాతవైనా సరే సొంత వెహికల్స్ కొనుక్కోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. సొంత వెహికల్ ఉంటేనే మేలని వారు కోరుకుంటున్నారు. దేశంలో యూజ్డ్ వెహికల్స్ సేల్స్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. యూజ్డ్ టూ వీలర్లు, కార్ల సేల్స్ జోరందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలల్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేవారు ఎక్కువవుతున్నారని పేర్కొంటున్నాయి. కరోనా సోకుతుందనే భయంతో జనం ఆటోల్లో, క్యాబుల్లో, బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అలాగని కొత్త వెహికల్ కొనే పరిస్థితి లేదు కాబట్టి పాత వాటిని ఎంచుకుంటున్నారు. కార్ల కంపెనీలు కూడా పాత వెహికల్స్‌ను అమ్ముతున్నాయి. ఉదాహరణకు మహీంద్రా ‘ఫస్ట్ చాయిస్’ పేరుతో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వ్యాపారం చేస్తోంది. ఇది మార్కెట్ లీడర్ కూడా. కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు పడిపోయాయి. దాదాపు అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం ఏవైనా కొనడానికి జంకుతున్నారు. ఫలితంగానే సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పడిపోతున్న కొత్త కార్ల అమ్మకాలు
ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త వెహికల్స్ అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. మనదేశంలో వరుసగా తొమ్మిదో క్వార్టర్లో కూడా సేల్స్ పడిపోయాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఆటోమేకర్స్ 7.12 లక్షల యూనిట్స్ అమ్మితే 2020 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.53 లక్షల యూనిట్లు అమ్మాయి. అంటే ఏకంగా 78 శాతం తగ్గాయి. ఆటో ఇండస్ట్రీలోని ప్రతి సెగ్మెంట్లో నష్టాలే కనిపిస్తున్నాయి. కమర్షియల్‌తోపాటు ప్యాసింజర్, టూవీలర్స్ షోరూమ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెహికల్ సేల్స్ 25 శాతం పడిపోయి 21 లక్షల యూనిట్లకు పడిపోతాయని క్రిసిల్ అంచనా వేసింది. ఇటువంటి కష్టకాలంలో యూజ్డ్కార్ల మార్కెట్ మాత్రం బాగానే ఉంది. గత ఏడాది కొత్త కార్ల అమ్మకాలు 18 శాతం తగ్గితే, యూజ్డ్ వెహికల్స్ సేల్స్ 10 శాతం పెరిగాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూజ్డ్ వెహికల్స్ సేల్స్ కూడా 14 శాతం పడిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు కొత్త వెహికల్స్ కంటే పాతవే ఎక్కువ అమ్ముడవుతాయని ఫ్రాస్ట్ అండ్ సులివన్ అనే మార్కెట్ రీసెర్చ్ కంపెనీకి చెందిన కౌశిక్ మాధవన్ చెప్పారు. అన్ని కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తాయని అన్నారు. మారుతీ ట్రూవాల్యూ పేరుతో యూజ్డ్ వెహికల్స్ వ్యాపారం చేస్తోంది. ఇది వరకు ఇది తన కంపెనీ కార్లను మాత్రమే కొనేది. ఇప్పుడు అన్ని కంపెనీల యూజ్డ్ వెహికల్స్‌ను కొంటోంది.
అందరూ కొనట్లే…
యూజ్డ్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్న మాట నిజమే కానీ ఈ సెగ్మెంట్ పరిస్థితి అత్యద్భుతంగా ఏమీ లేదు. చాలా మంది ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారని, కొనే వాళ్లు మాత్రం చాలా తక్కువని ట్రూవాల్యూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నారని చెప్పారు. మహీంద్రా ఫస్ట్ సీఈఓ ఆశుతోష్ పాండే కూడా ఇలాగే మాట్లాడారు. షోరూమ్‌లకు చాలా మంది వస్తారు కానీ కొనేది అతికొద్ది మంది మాత్రమేనని పేర్కొన్నారు. కరోనా వచ్చాక యూజ్డ్ వెహికల్స్ కోసం ఎంక్వైరీలు 20 శాతం పెరిగాయని చెప్పారు. ‘‘ఇది వరకు మేం ఒక డీల్‌ను పూర్తి చేయడానికి 30 రోజులు పట్టేది. ఇప్పుడు 20 రోజుల్లోపే పనైపోతున్నది. గతంతో పోలిస్తే అమ్మకాలు కాస్త పెరిగాయి”అని వివరించారు. ఎక్కువ మంది కస్టమర్లు రూ.మూడు లక్షల లోపు ధర ఉన్న నాలుగేళ్లలోపు యూజ్డ్ వెహికల్స్‌ను కొంటున్నారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో మూడేళ్లలోపు వయసున్న యూజ్డ్ వెహికల్స్ వాటా 19 శాతం ఉంది. ఐదేళ్లలోపు వయసున్న యూజ్డ్ వెహికల్స్ వాటా 35 శాతం ఉంది. ఎనిమిదేళ్లలోపు వయసున్న యూజ్డ్ వెహికల్స్ వాటా 46 శాతం ఉంది. అయితే చాలా మంది వెహికల్‌ను కనీసం ఏడేళ్లు వాడాకే అమ్ముతున్నారు. అందుకే ఎక్స్చేంజ్ బయింగ్స్ కూడా ఆలస్యమవుతున్నాయని పాండే వివరించారు. మరో సమస్య ఏమిటంటే.. అన్ని నగరాల్లో స్విఫ్ట్ డిజైర్, వేగన్ ఆర్, హోండా సిటీ, ఇన్నోవాకు బాగా డిమాండ్ ఉంది. టూవీలర్స్‌లో హీరో స్పెండర్ను, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సప్లై మాత్రం తక్కువ ఉంది. వెహికల్ లోన్లపై ఇటీవల దాకా మారటోరియం ఉండటంతో, బ్యాంకులు వెహికల్స్ వేలాన్ని వాయిదా వేస్తున్నాయి. సప్లై తగ్గడానికి ఇదీ ఒక కారణం. ఫైనాన్షియర్లు పాత వెహికల్స్‌కు లోన్లు ఇవ్వడానికి కూడా అంతగా ఇష్టపడటం లేదు.
హైదరాబాద్‌లో డిమాండ్ ఉంది.. సప్లై లేదు
ఇతర సిటీల మాదిరిగానే హైదరాబాద్‌లోనూ సెకండ్ హ్యాండ్ కార్లకు, టూవీలర్లకు డిమాండ్ పెరుగుతోందని పలువురు డీలర్లు చెప్పారు. రూ.ఐదు లక్షలలోపు కార్లకు మంచి డిమాండ్ ఉందని, ఎక్కువ మంది మారుతీ కంపెనీ వెహికల్స్‌ను ఇష్టపడుతున్నారని అంటున్నారు. టూవీలర్లలో అయితే స్ప్లెండర్, యాక్టివా, యూనికార్న్ బండ్లకు డిమాండ్ ఎక్కువని హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన వ్యాపారి శ్రీనివాస్ అన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్లను అమ్మేవారి సంఖ్య తగ్గిందని చెప్పారు. జనం కొత్త బండ్లు కొనడం లేదని, అందుకే పాతబండ్లు అమ్మేవాళ్ల సంఖ్య తగ్గిందని చెప్పారు. గిరాకీ ఉన్నా తగినన్ని టూవీలర్లు అందుబాటు లోకి రావడం లేదన్నారు. క్వాడ్రాకార్స్ అనే షాపు యజమాని అవేశ్ మాట్లాడుతూ మారుతీ మినహా ఇతర కార్లకు డిమాండ్ తగ్గిందని చెప్పారు.
మరో సెకండ్‌హ్యాండ్ల కార్ల వ్యాపారి నరేందర్ మాట్లాడుతూ ‘‘కరోనా ముందు కాలంతో పోలిస్తే డిమాండ్ పెరిగింది. కానీ క్వాలిటీ వెహికల్స్ ఎక్కువగా దొరకట్లేదు. గతంతో పోలిస్తే ఓనర్లు రేట్లు ఎక్కువ చెబుతున్నారు. దీంతో పాత కార్ల ధరలూ ఎక్కువయ్యాయి. స్విఫ్ట్, ఆల్టో, వేగనార్ మోడల్స్‌కు గిరాకీ ఎక్కువ ఉంది. ఉదాహరణకు రూ.నాలుగు లక్షల ధర ఉన్న వెహికల్ ధర ఇప్పుడు రూ.4.50 లక్షలకు చేరింది. డిమాండ్ సప్లైల మధ్య తేడానే ఇందుకు కారణం. కార్స్24, కార్స్ దేఖో వంటి కంపెనీలు వచ్చాక మాలాంటి వాళ్ల వ్యాపారాలు కాస్త దెబ్బతిన్నాయి. ఇక నుంచి కూడా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ బాగానే ఉంటుంది’’ అని వివరించారు.
For More News..