ప్రభుత్వ బ్యాంకులకు మస్తు లాభాలు 

ప్రభుత్వ బ్యాంకులకు మస్తు లాభాలు 
  • 2020-21లో రూ.31 వేల కోట్లు
  • గత ఐదేళ్లలో ఇదే హైయెస్ట్​
  • క్యాపిటల్​కు ఢోకా లేదు
  • ఆర్థిక మంత్రికి వెల్లడించిన బ్యాంకర్లు

న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకులు (పీఎస్​బీలు) రూ.31,820 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేశాయని,  గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికమని వీటి మేనేజ్​మెంట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలిపాయి. పీఎస్​బీల దగ్గర తగినంత క్యాపిటల్ ఉందని, సెప్టెంబరు 2021 నాటికి వాటి సీఆర్ఏఆర్/క్యాపిటల్​ అడెక్వసీ రేషియో 14.4 శాతం ఉందని ఆమెకు వివరించాయి. ఆర్​బీఐ రూల్స్ ప్రకారం ఇది 11.5 శాతం (సీసీబీతో సహా) ఉండాలి. ఈ సందర్భంగా సీతారామన్, పీఎస్​బీల పనితీరును పరిశీలించారు. 

కరోనా నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్​బీఐ ప్రారంభించిన  చర్యలను బ్యాంకులు అమలు చేస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్​ లైన్​ గ్యారంటీ (ఈసీఎల్​జీ) స్కీము ద్వారా సాధించిన  విజయాలను అభినందించారు. కరోనా మహమ్మారి వల్ల నష్టపోతున్న రంగాలకు సాయం చేయాలని ఆర్థిక మంత్రి సూచించారు. వ్యవసాయ రంగం, రైతులు, రిటైల్ రంగం,  ఎంఎస్ఎంఈలకు బ్యాంకర్లు మద్దతు కొనసాగించాలని మంత్రి సూచించారు.  "ఓమిక్రాన్ వల్ల సమస్యలు ఉన్నప్పటికీ ఎకానమీ, బిజినెస్​లు పుంజుకుంటున్నాయి. కష్టాలు ఎదుర్కొంటున్న కొన్ని రంగాలకు మరింత సాయం అవసరం. క్రెడిట్​గ్రోత్​ కూడా బాగుంది. రిటైల్​ సెగ్మెంట్​ ఎదుగుతోంది”అని ఆమె అన్నారు. పాత బాకీలు వేగంగా వసూలవుతున్నాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్​కు పీఎస్​బీల ఆఫీసర్లు వివరించారు.  

పీఎస్​బీల పనితీరు.. హైలైట్స్

1)    పీఎస్​బీలు  2020 -21 ఆర్థిక సంవత్సరంలో రూ.31,820 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేశాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికం.
2)    2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో రూ.31,145 కోట్ల నికర లాభం వచ్చింది. ఇవి 2020-21 ఆర్థిక సంవత్సరం లాభాలకు  సమానం.
3)    గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్​బీలు లోన్లకు సంబంధించి రూ.5,49,327 కోట్ల 
        రికవరీని సాధించాయి.
4)   పీఎస్​బీల దగ్గర తగినంత క్యాపిటల్ ఉంది.  సెప్టెంబర్ 2021 నాటికి పీఎస్​బీల సీఆర్ఏఆర్ 14.4శాతంగా రికార్డు అయింది. రెగ్యులేటరీ రూల్స్​ ప్రకారం ఇది 11.5శాతం (సీసీబీతో సహా) ఉండాలి.
5)    రెగ్యులేటరీ రూల్స్​ ప్రకారం పీఎస్​బీల దగ్గర కామన్​ ఈక్విటీ టైర్​–1 ( సీఈటీ1)ఎనిమిది శాతం ఉండాలి. సెప్టెంబర్ 2021 నాటికి వీటి వద్ద ఇది10.79 శాతం ఉంది.
6)    సెప్టెంబర్ 2021 నాటికి పీఎస్​బీలు పర్సనల్​ లోన్లలో సంవత్సరానికి 11.3 శాతం, వ్యవసాయ లోన్లలో 8.3 శాతం గ్రోత్​ సాధించాయి.  మొత్తం క్రెడిట్ గ్రోత్ 3.5 శాతం ఉంది.
7)    అక్టోబర్ 2021లో ప్రారంభించిన క్రెడిట్ ఔట్​రీచ్​ ప్రోగ్రామ్ కింద, పీఎస్​బీలు మొత్తం రూ.61,268 కోట్ల లోన్లను మంజూరు చేశాయి.
8)    కరోనా మహమ్మారి సమయంలో, పీఎస్​బీలు ఈసీఎల్జీఎస్ (కరోనాతో నష్టపోయిన ఎంఎస్ఎంఈరంగానికి సాయం అందించడానికి 2020 మేలో  ప్రారంభమైన పథకం), ఎల్జీఎస్సీఏఎస్,  పీఎం స్వనిధి వంటి వివిధ ప్రభుత్వ పథకాల కింద భారీగా లోన్లు ఇచ్చాయి. 
9)    ఈసీఎల్జీఎస్  కింద ప్రభుత్వం అందించిన డబ్బులో 4.5 లక్షల కోట్లలో  64.4 శాతం (రూ.2.9 లక్షల కోట్లు)  నవంబర్ 2021 వరకు మంజూరు చేశారు. ఈసీఎల్జీఎస్ కారణంగా 13.5 లక్షలకు పైగా చిన్న యూనిట్లకు చెందిన రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ లోన్ల మొండిబాకీల లిస్టు నుంచి బయటకు వచ్చాయి.