కరోనా థర్డ్ వేవ్ భయం.. వెంటనే జరిపిస్తున్నరు

కరోనా థర్డ్ వేవ్ భయం.. వెంటనే జరిపిస్తున్నరు
  • కరోనా థర్డ్ వేవ్ భయంతో వెంటనే జరిపిస్తున్న జనం
  • ఈ నెల 20లోపే మంచి ముహూర్తాలు..
  • మళ్లీ మార్చి దాకా ఆగాల్సిందేనంటున్న పురోహితులు

హైదరాబాద్, వెలుగు: ఇట్ల పిల్ల, పిల్లగాడు నచ్చుడే ఆలస్యం.. మాట ముచ్చట ఎన్కశీరి అని ఎంత జల్దిన అయితే అంత జల్దిన లగ్గం చేసేయాలని తల్లిదండ్రులు ఫిక్స్​ అవుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ భయంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచి ముహూర్తాలను చేసుకొని పెండ్లిళ్లు జరిపిస్తున్నారు. నిన్నమొన్నటి దాకా మెల్లిగా ముహూర్తాలు పెట్టుకోవచ్చని భావించినోళ్లు కూడా ఇప్పుడు మ్యారేజ్​ బ్యూరోల చుట్టూ, పురోహితుల చుట్టూ తిరుగుతున్నారు. రానున్న రోజులు ఎట్లుంటాయోనని దగ్గర డేట్​లో మంచి ముహూర్తాలు చూడాలని కోరుతున్నారు. నిరుడు ఇదే సమయంలో ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ సెకండ్​ వేవ్​ వల్ల రూల్స్​ అమలులోకి రావడంతో చాలా వివాహాలు వాయిదా పడ్డాయి. కొన్ని లగ్గాలు మాత్రం తక్కువ మంది గెస్ట్​ల సమక్షంలో  జరిగాయి. ప్రస్తుతం చాలా దేశాల్లో ఒమిక్రాన్​ వేరియంట్​ విస్తరిస్తుండటం, మన దేశంలోకి కూడా ప్రవేశించడంతో  ఎక్కడ  ఆంక్షలు అమలులోకి వస్తాయోనని శుభకార్యాలకు దగ్గరి డేట్​లో ముహూర్తాలు ఫిక్స్​ చేసుకుంటున్నారు. గృహప్రవేశాలకు కూడా ఇదే తీరుగా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెండ్లిళ్లు, గృహప్రవేశాల సందడి కనిపిస్తున్నది. 
ఈ నెల  20 లోపే..!
సోమవారం నుంచి జనవరి ఒకటి వరకు మార్గశిర మాసం ఉంటుందని, ఈ నెల 20 వరకు మంచి ముహూర్తాలున్నాయని పురోహితులు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మార్చి వరకు మంచి ముహూర్తాలు లేవంటున్నారు. దీంతో ఈ నెల 20 లోపే చాలామంది తమ శుభకార్యాలకు డేట్లు కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. 
మ్యారేజ్​ బ్యూరోలు, ఫంక్షన్​ హాళ్లకు గిరాకీ
పిల్లను, పిల్లగాడ్ని వీలైనంత త్వరగా చూడండంటూ మ్యారేజ్​ బ్యూరోలకు, కన్సల్టెన్సీలకు డిమాండ్​ పెరిగింది. దీన్ని ఓనర్లు క్యాష్‌​ చేసుకుంటున్నారు. క్లయింట్లు కోరుకున్న విధంగా వెంటవెంటనే వధువు, వరుడ్ని సెట్​ చేస్తున్నారు. గత నెలరోజుల్లోనే  గ్రేటర్​ హైదరాబాద్​లో మ్యారేజ్​ బ్యూరోలు, కన్సల్టెన్సీల ద్వారా దాదాపు లక్షకు పైగా పెండ్లిళ్లు ఫిక్స్​ అయ్యాయి. చాలా పెండ్లిళ్లు జరిగాయి. గ్రేటర్​ హైదరాబాద్​లో మూడువేలకు పైగా మ్యారేజ్​ బ్యూరోలు, కన్సల్టెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఫంక్షన్ హాల్స్​కు కూడా మస్తు గిరాకీ పెరిగింది. ఈ నెల 20లోపే మంచి ముహూర్తాలు ఉండటంతో అందులో ఏదో ఒక డేట్​ను జనం ఫిక్స్​ చేసుకొని.. ఫంక్షన్​ హాల్స్​ కోసం వెతుకుతున్నారు. చాలా కల్యాణమండపాలు ఇప్పటికే బుక్​ 
అయిపోయాయి. 

ఈ నెల 20 దాటితే.. మళ్లీ మార్చి లోనే...
ఈ నెలలో 20 వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి.  ఇవిపోతే మళ్లీ మార్చి వరకు ఆగాలి. అందుకే పెండ్లి ముహూర్తాలు మంచి రోజుల్లో చూడాలని మమ్మల్ని చాలామంది సంప్రదిస్తున్నారు. 
                                                                                                                                                                - వినోద్ శర్మ, పురోహితుడు

టైంను యూజ్​ చేసుకుంటున్నరు
నిరుటితో చూస్తే ఇప్పుడు మా మ్యారేజ్ బ్యూరోకు రోజుకు వందల్లో ఎంక్వైరీ కాల్స్ వస్తున్నా యి. ఒమిక్రాన్ టెన్షన్, రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని జనం భయపడుతున్నారు. చాలా పెండ్లిళ్లు  ఫిక్స్ అయి కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యాయి. కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న టైంని యూజ్ చేసుకుంటున్రు. 
                                                                                                                                   - లహరి, తోడు నీడ కన్సల్టెన్సీ నిర్వాహకురాల