బాహుబలి సీన్ రిపీట్: హాస్పిటల్ వెళ్లాలంటే.. శివగామిలా మారాల్సిందేనా?

బాహుబలి సీన్ రిపీట్: హాస్పిటల్ వెళ్లాలంటే..  శివగామిలా మారాల్సిందేనా?

బాహుబలి సినిమాలో శివగామి మహేంద్ర బాహుబలిని బల్లాల దేవ నుంచి రక్షించడానికి నదిలో ఈదుతూ.. ప్రాణాలు విడిచి బాబు ప్రాణాలు కాపాడిన ఘటన గుర్తుందా.. ప్రాణాలు కాపాడుకోవడానికి అలాంటి దుస్థితే నిజజీవితంలోనూ ఎదురైతే.. ఆ పరిస్థితి ఎంత నరకంలా ఉంటుందో కదా. కుమురం భీం జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 

కెరమెరి మండలం లక్మాపూర్లో కవిత, పవన్ దంపతులకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. బాబుకి రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంటోంది. వీరు హాస్పిటల్ వెళ్లాలంటే లక్మాపూర్ వాగు దాటాలి. దీనిపై వంతెనలు లేకపోవడం.. వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేకపోయింది. చిన్నారిని ఎలాగైనా రక్షించుకోవాలనే బంధువుల తపన వారిని వాగు దాటించేలా చేసింది. 

దగ్గరి బంధువు సాయంతో బాబుని చేతులతో పైకి ఎత్తి పట్టుకుని వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు.  నిత్యావసరాలకు వెళ్లాలన్నా ఇదే దుస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

నత్తతో పోటీపడుతున్న వంతెన పనులు..

2016లో వంతెన మంజూరై ప్రారంభమైనా నేటికి ఆ పనులు నత్తతో పోటీ పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వచ్చే టీచర్లు సైతం ఈ వాగు దాటాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిస్తే వాగు దాటే పరిస్థితి లేదని అంటున్నారు. 

దీంతో మండల కేంద్రానికి గ్రామంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. ఇకనైనా వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.