రేపిస్టులకు, గ్యాంగ్​స్టర్లకు నో చాన్స్

రేపిస్టులకు, గ్యాంగ్​స్టర్లకు నో చాన్స్

ఖైదీలకు దాంపత్య ములాఖత్​
మూడు నెలలకోసారి 2 గంటలపాటు లైఫ్​ పార్ట్​నర్​తో కలిసుండే చాన్స్
అందుకు జైలులోనే ప్రత్యేక గది ఏర్పాటు చేసిన పంజాబ్ సర్కారు

చండీగఢ్: మంచి ప్రవర్తన కలిగిన ఖైదీల కోసం పంజాబ్ జైళ్ల శాఖ దాంపత్య ములాఖత్ విధానాన్ని తీసుకువచ్చింది. వాళ్ల జీవిత భాగస్వామితో కొంతసమయం సన్నిహితంగా గడిపే అవకాశం కల్పించింది. మొదటగా గోయింద్వాల్ సాహిబ్​లోని సెంట్రల్ జైలులో మంగళవారం నుంచి ఈ పద్ధతిని ప్రారంభించారు. దాంతోపాటు నాభాలోని జిల్లా జైలు, భటిండాలోని మహిళా జైలులో దాంపత్య ములాఖత్​కు అనుమతిచ్చారు. ఇందులో భాగంగా ములాఖత్​ కోసం జైలులోనే అటాచ్​డ్​ బాత్రూమ్​ ఉన్న ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. 3 నెలలకు ఒకసారి  2 గంటలు గడిపే అవకాశం కల్పించనున్నారు.

రేపిస్టులకు, గ్యాంగ్​స్టర్లకు నో చాన్స్

జైళ్లలో ఎక్కువ కాలం గడిపిన, మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రాధాన్యత ఇస్తామని, కరడుగట్టిన నేరస్తులకు, గాంగ్​స్టర్లకు, లైంగిక సంబంధిత నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉండదని జైళ్ల శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రయత్నం వాళ్ల కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి, ఖైదీల మంచి ప్రవర్తనకు దారి తీస్తుందని తెలిపారు. ములాఖత్​కు ముందే జీవిత భాగస్వామి మ్యారేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆరోగ్యంగా ఉన్నట్లు మెడికల్ రిపోర్టులు తేవాల్సి ఉంటుందని అధికారి వెల్లడించారు.