కేజ్రీవాల్​పై పరువునష్టం కేసు పెడ్త

కేజ్రీవాల్​పై పరువునష్టం కేసు పెడ్త
  • పంజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్​ చన్నీ 

చండీగఢ్: తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​పై పరువు నష్టం కేసు పెడ్తానని పంజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులను కించపర్చేలా మాట్లాడటం కేజ్రీవాల్​కు అలవాటేనని మండిపడ్డారు. గతంలోనూ బీజేపీ నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్​ జైట్లీ, ఎస్​ఏడీ నేత విక్రమ్​సింగ్​లపై ఇట్లనే మాట్లాడి సారీ చెప్పారని గుర్తుచేశారు. ఈ మధ్య పంజాబ్​లోని చాలాచోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఈ రెయిడ్స్​లో చన్నీ మేనల్లుడి ఇంట్లో రూ.8 కోట్లు పట్టుబడ్డాయి. వీటినుద్దేశించి సీఎం చన్నీ అవినీతిపరుడని, నిజాయితీ లేని వ్యక్తి అని కేజ్రీవాల్ బుధవారం ట్వీట్ చేశారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో చామ్‌‌కౌర్ సాహిబ్‌‌ సెగ్మెంట్​లో చరణ్​జిత్ చన్నీ ఓడిపోతారని కేజ్రీవాల్ శుక్రవారం మరో ట్వీట్ చేశారు. చన్నీ మేనల్లుడి ఇంట్లో అధికారులు నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న ఫొటోలు చూసి జనం నోరెళ్లబెట్టారని పేర్కొన్నారు. అవినీతి బయటపడింది కాబట్టి ప్రజలు ఆయనను ఓడిస్తారని చెప్పారు. ఈ కామెంట్లపై చన్నీ శుక్రవారం ప్రెస్ మీట్​లో ఫైర్ అయ్యారు.

కేజ్రీవాల్ హద్దులు దాటిన్రు

ఆప్ నేత కేజ్రీవాల్ మితిమీరి మాట్లాడారని చరణ్​జిత్ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పరువు నష్టం కేసు పెట్టేందుకు పర్మిషన్ ఇయ్యాలని కాంగ్రెస్ హైకమాండ్​ను కోరానని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసుడేందని ప్రశ్నించారు. ‘‘ఎవరిమీదో దాడులు జరిగితే.. ఎవరి దగ్గర్నో పైసల్ దొరికితే నేను నిజాయితీ లేని మనిషినని నోట్ల కట్టలతో కలిపి నా ఫొటోలు ట్విట్టర్ల పెట్టుడేంది? గతంలో నీ మేనల్లుడు అట్లనే పట్టుబడినప్పుడు నువు అవినీతిపరుడివని చెప్పుకున్నవా’’ అని కేజ్రీవాల్​పై సీఎం చన్నీ మండిపడ్డారు. ‘‘పంజాబ్​లో ఈడీ 10చోట్ల దాడులు చేసి డబ్బులు పట్టుకున్నది. దాంతో నాకేం సంబంధం? అవేమన్నా నా పైసలా? నా ఇంట్ల డబ్బు దొర్కితే అడగండి”అని తన మేనల్లుడి ఇంట్లో క్యాష్ దొరికింది కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు చన్నీ సమాధానమిచ్చారు.