యూపీ, బీహారీ వ్యాఖ్యలపై చన్నీ సంజాయిషీ

యూపీ, బీహారీ వ్యాఖ్యలపై చన్నీ సంజాయిషీ

పంజాబ్లోకి యూపీ, బీహారీలను రానివ్వబోమన్న పంజాబ్ సీఎం వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ కామెంట్లపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చన్నీ స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని సంజాయిషీ ఇచ్చారు. పంజాబ్ ప్రతి ఒక్కరిదీ అని అన్నారు. నిజానికి తాను ఆ కామెంట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఉద్దేశించి చేశానని చన్నీ వివరణ ఇచ్చారు. మరోవైపు చన్నీ కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. చన్నీ ఉద్దేశం అది కాదని, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పంజాబ్ను పంజాబీలు మాత్రమే పాలించాలన్నదే చన్నీ ఉద్దేశమని, కానీ ఆ మాటల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. యూపీ, బీహార్ నుంచే కాదు ఎవరైనా ఎక్కడి నుంచైనా పంజాబ్ కు రావచ్చని ప్రియాంక చెప్పారు. 

ఇదిలా ఉంటే చన్నీ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఈ కామెంట్లు యూపీలో పుట్టిన సంత్ రవిదాస్, బీహార్ లో పుట్టిన గురు గోవింద్ సింగ్ ను అవమానించడమేనని అన్నారు. చన్నీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ చప్పట్లు కొట్టడాన్ని తప్పుబట్టిన ప్రధాని.. కాంగ్రెస్ విధానం ఇదేనా అని ప్రశ్నించారు.