లక్నో సూపర్​..పంజాబ్ పై 20 రన్స్ తేడాతో గెలుపు

లక్నో సూపర్​..పంజాబ్ పై 20 రన్స్ తేడాతో గెలుపు

పుణె:లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ ఖతర్నాక్‌‌ బౌలింగ్‌‌తో  కేక పుట్టించింది. బ్యాటింగ్‌‌లో రాణించలేక తక్కువ స్కోరుకే పరిమితమైనా.. బౌలర్లు చెలరేగడంతో  పంజాబ్‌‌ కింగ్స్‌‌పై పంజా విసిరి లీగ్‌‌లో ఆరో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో లక్నో 20 రన్స్ తేడాతో పంజాబ్‌‌ను ఓడించింది.  మరోవైపు బ్యాటింగ్​ వైఫల్యంతో పంజాబ్‌‌ ఐదో ఓటమి మూట గట్టుకుంది.  తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 153/8 స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్ (37 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) టాప్ స్కోరర్. రబాడ (4/38), చహర్ (2/30) సత్తా చాటారు. అనంతరం లక్నో బౌలర్లు  మోసిన్ (3/24), చమీర (2/17), క్రునాల్ (2/11) దెబ్బకు పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 133/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. బెయిర్ స్టో (28 బాల్స్ లో 32) కాసేపు పోరాడాడు. క్రునాల్​ ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు.​  

13 రన్స్‌‌ తేడాలో ఐదు వికెట్లు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు  దిగిన లక్నో 13 రన్స్ కే కేఎల్ రాహుల్ (6) వికెట్ కోల్పోయింది. అనంతరం డికాక్, దీపక్ హుడా (34) రెండో వికెట్ కు 85 రన్స్ పార్ట్ నర్ షిప్ తో జట్టును ఆదుకున్నరు. ఐదో ఓవర్లో 6,6తో డికాక్ జోరు మీద కనిపించగా.. మొదట నెమ్మదిగా ఆడిన హుడా 8వ ఓవర్లో సిక్స్ తో టచ్ లోకి వచ్చాడు. ఇలా వీరిద్దరూ ఓవర్ కో బౌండరీ బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లడంతో 12.3 ఓవర్లలో 98/1తో నిలిచిన లక్నో  భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ 13 రన్స్  తేడాలో 5 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది.  13వ ఓవర్లో డికాక్ ఔటవగా, హుడాను బెయిర్ స్టో సూపర్ త్రోతో రనౌట్ చేశాడు. క్రునాల్ (7), బదోని (4), స్టోయినిస్ (1) ఫెయిలవడంతో 111/6తో నిలిచిన  లక్నో డీలా పడ్డది. అయితే స్లాగ్ ఓవర్లలో హోల్డర్ (11) ఓ సిక్స్, చమీర (17) రెండు సిక్సర్లు బాది ఔటవగా.. మోసిన్ ఖాన్ (13 నాటౌట్) ఓ సిక్స్, ఫోర్ సాయంతో జెయింట్స్ 150 మార్కు  దాటింది.  

పంజాబ్​ డీలా..

టార్గెట్ చిన్నదే అయినా భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైన పంజాబ్ ఓటమిని కొనితెచ్చుకుంది. ఛేజింగ్ ను నెమ్మదిగా మొదలెట్టిన పంజాబ్ కు మూడో ఓవర్లో కెప్టెన్ మయాంక్ (25) 6,4తో వేగం తెచ్చాడు. కాసేపటికే మరో 6,4తో దూకుడు మీదున్న అతడిని చమీర ఔట్ చేశాడు. ఇక, తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన ధవన్ (6), రాజపక్స (9) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో పంజాబ్ డిఫెన్స్ లో పడిపోయింది. ఆపై బెయిర్ స్టో, లివింగ్​స్టోన్ (18) ఇన్నింగ్స్ ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. బిష్నోయ్ వేసిన 11వ ఓవర్లో 6,6,4 బాదిన బెయిర్ స్టో గేర్ మార్చాడు.  పంజాబ్ విజయం ఖాయం అనుకుంటున్న టైమ్‌‌లో లక్నో బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. వరుస ఓవర్లలో లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ (2)ను ఔట్‌‌ చేయడంతో 13.2 ఓవర్లలో 92/5తో పంజాబ్ కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనవ్వని బెయిర్ స్టో 15వ ఓవర్లో 4,4తో స్కోర్ ను వంద దాటించాడు. కానీ తర్వాతి ఓవర్లోనే అతడు ఔటవడంతో లక్నో విక్టరీకి చేరువైంది. మోసిన్‌‌ వేసిన 18వ ఓవర్లో రబాడ (2), చహర్ (4) కూడా వెనుదిరిగారు. ఆల్‌‌రౌండర్‌‌ రిషీ ధవన్‌‌ (21 నాటౌట్‌‌) చివరి దాకా క్రీజులో ఉన్నా తన టీమ్‌‌ను గెలిపించలేకపోయాడు.