Vladimir Putin : భారతీయ సినిమాలపై పుతిన్ ప్రేమ.. ఇండియన్ మూవీస్ కోసం ప్రత్యేక ఛానెల్.. 24 గంటలూ..!

Vladimir Putin : భారతీయ సినిమాలపై పుతిన్ ప్రేమ..  ఇండియన్ మూవీస్ కోసం ప్రత్యేక ఛానెల్.. 24 గంటలూ..!

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఎల్లలు దాటి మన సినీ పరిశ్రమ సత్తా చాటుతోంది. 24 గంటలు భారతీయ చిత్రాల ప్రదర్శన కోసం ఏకంగా ఒక టీవీ ఛానెల్ కూడా నడుపుతోంది ఆ దేశం.  మన చిత్రాలంటే ఆ దేశప్రజలకే కాదు.. అధ్యక్షుడికి కూడా ఎంతో ఇష్టం.. ఇంతకీ ఆ దేశమేదో కాదు.. మన చిరకాల మిత్రదేశం రష్యా.. 

ఇండియన్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక టీవీ ఛానెల్‌..

భారత్‌తో రష్యా అనుబంధం కేవలం రాజకీయ, ఆర్థిక, రక్షణ ఒప్పందాలకే పరిమితం చేయలేదు. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా మన భారతీయ సినిమానే. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా సోచిలో జరిగిన వాల్దాయ్ డిస్కషన్ గ్రూప్ సదస్సులో మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు బలమైన ఆదరణ ఉందని తెలిపారు.

ALSO READ : "నిర్మాతలందరూ సిగ్గుపడాలి": 'కాంతార: చాప్టర్ 1'పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

"మాకు భారతీయ సినిమా అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే ఇండియన్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక టీవీ ఛానెల్‌ను కలిగి ఉన్న ఏకైక దేశం బహుశా రష్యానే కావచ్చు అని పుతిన్ వెల్లడించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా, తమ దేశానికి, భారత్‌కు మధ్య లోతైన సాంస్కృతిక ,  మానవీయ సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం రష్యాకు వస్తున్నారని, వారి సంస్కృతిని, ప్రజలను తమ దేశం స్వాగతిస్తుందని తెలిపారు.

చరిత్ర పుటల్లో చెరగని ముద్ర

పుతిన్ భారతీయ సినిమాను పొగడటం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన బాలీవుడ్ సినిమాల గురించి, రష్యాలో వాటికి ఉన్న ప్రజాదరణ గురించి అనేకసార్లు మాట్లాడారు. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో, బ్రిక్స్ (BRICS) కూటమిలోని ఇతర దేశాల వినోదం కంటే ఇండియన్ సినిమాలే రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందాయని పుతిన్ అంగీకరించారు. బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే, భారతదేశంలోని సినిమాలు రష్యాలో అత్యంత ప్రాచుర్యం పొందాయని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇండియన్ సినిమాలను రౌండ్ ది క్లాక్ చూపే ప్రత్యేక టీవీ ఛానెల్ మాకుంది. భారతీయ చిత్రాలపై మాకు చాలా ఆసక్తి ఉంది అని పుతిన్ అన్నారు.

నిజానికి, రష్యాలో ఇండియన్ సినిమాలపై ఈ అభిమానం సోవియట్ యుగం నాటిది. ఆ రోజుల్లోనే రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి హిందీ చిత్రాల నటులు రష్యా దేశమంతటా అపారమైన ప్రజాదరణ పొందారు. రాజ్ కపూర్ నటించిన 'ఆవారా' (Awaara) చిత్రం అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాటలు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు వంటి అంశాలు రష్యన్ల హృదయాలకు దగ్గరయ్యాయి. ఈ సాంస్కృతిక వారసత్వమే నేటికీ కొనసాగుతోంది.

 

డిసెంబర్‌లో భారత్ పర్యటన ఖరారు!

ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు డిసెంబర్ తొలి వారంలో భారతదేశంలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను పుతిన్ ధృవీకరించారు. ఈ పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, తన ప్రియమైన స్నేహితుడు, నమ్మకమైన భాగస్వామి అయిన ప్రధాని మోదీని కలవడానికి ఉత్సుకతతో ఉన్నానని తెలిపారు. సాంస్కృతిక బంధాలు, విద్య, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అనేక అంశాలలో భారత్-రష్యాల బంధం బలపడుతోందనడానికి పుతిన్ వ్యాఖ్యలు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.