తెలంగాణ బిడ్డ ఘన కీర్తి… పీవీ జయంతి

తెలంగాణ బిడ్డ ఘన కీర్తి… పీవీ జయంతి

దేశానికి ఇప్పటివరకు చాలా మంది ప్రధానులుగా పనిచేశారు. కానీ దేశ ఎకానమీని ఒక మలుపు తిప్పిన ఘనత మాత్రం తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు. ఇవాళ ప్రపంచదేశాల మధ్య ఇండియా గర్వంగా తలెత్తుకుని ఉందంటే దాని వెనుక ఆయన ముందుచూపు ఉంది. ఇండియాను ఫైనాన్షియల్ గా బలమైన శక్తిగా చేయడంలో పీవీది కీలక పాత్ర. బ్యూరోక్రాట్ గా ఉన్న  మన్మోహన్ ను ఫైనాన్స్ మినిస్టర్ ను చేసి తన ఆలోచనలకు అనుగుణంగా అనేక మార్పులు తీసుకువచ్చారు. మోడర్న్ ఇండియా ఆర్కిటెక్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండియా డెవలప్ మెంట్ కు ఇంతగా కృషి చేసినా కేవలం సౌతిండియన్ అనే కారణంగా ఆయనకు రావలసినంత గౌరవం రాలేదంటారు.

పీవీ నరసింహా రావు పెద్దగా మాట్లాడరు. చాలా మందికి మితభాషిగానే తెలుసు. అవసరమైతేనే తప్ప పెదవి విప్పరు. చడీ చప్పుడు లేకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆయనకు తెలిసిన విద్య. నిశ్శబ్దంగా ఉంటూనే దేశాన్ని సూపర్​ పవర్​ దిశగా నడిపించారు. పీవీ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకువచ్చేది ఆర్థిక సంస్కరణలే. స్వతంత్రం వచ్చాక నెహ్రూ ప్రారంభించిన ప్రభుత్వ – ప్రైవేటు ఆర్థిక విధానాన్నే చాలా ఏళ్ల పాటు మనం ఫాలో అయ్యాం. పీవీ నరసింహారావు తొలిసారి దీనికి బ్రేకులు వేశారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఓ కుదుపు కుదిపారు. ఇవాళ అనేక రంగాల్లో మనం అభివృద్ది లో దూసుకుపోతున్నామంటే అదంతా పీవీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితమే.

అనుకోని పరిస్థితుల్లో ప్రధాని పదవి
చాలామంది రాజకీయవేత్తలకు ప్రధాని కావడం టార్గెట్ గా ఉంటుంది. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే  ప్రధాని పదవి పీవీ నరసింహారావు ను వరించింది. రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని హైదరాబాద్ లో సెటిల్ అవుదామని 1991లో ఆయన నిర్ణయించుకున్నారట. అయితే లోక్ సభ ఎన్నికల మధ్యలో  రాజీవ్ గాంధీ హత్యకు గురైన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయ్యారు. అప్పటివరకు చాలా మంది రాజకీయ నాయకులకు ఆయనపై చిన్నచూపు ఉండేది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగినా తనకంటూ ఒక చిన్న గ్రూపును కూడా మెయింటైన్ చేసుకోని ఈ సౌతిండియన్  ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పగలడా ? అని అనుమానాలు వ్యక్తం చేశారు. పీవీ పాలనా పగ్గాలు చేపట్టాక ఈ అనుమానాలకు తెరపడింది. పాలనలో పీవీ పట్టు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.   పీవీది  మైనారిటీ ప్రభుత్వం. అయినాసరే  రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న  పీవీ చాలా చాకచక్యంగా మైనారిటీ సర్కార్ ఐదేళ్ల పదవీకాలాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు.అపర చాణక్యుడనిపించుకున్నారు.

ల్యాండ్ సీలింగ్ తెచ్చారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీవీ నరసింహారావు 1971  లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి  గ్రామాల్లో పరిస్థితి వేరేగా  ఉండేది. సెంటు భూమి కూడా లేని వారు ఎక్కువ మంది ఉంటే కొంతమంది పెత్తందార్ల  దగ్గర వందల ఎకరాల భూములు ఉండేవి. ఈ అన్యాయాన్ని పీవీ సరిదిద్దాలనుకున్నారు.  భూ సంస్కరణలు తీసుకువచ్చారు. అందరికీ దారి చూపించాలనుకుని తన దగ్గర ఉన్న 1200 ఎకరాల భూమిని వదులుకున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్  ప్రవేశ పెట్టారు. భూస్వాముల కోపాన్ని పట్టించుకోకుండా సీలింగ్ ను పకడ్బందీగా అమలు చేశారు. దీంతో పీవీని  ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించివేయడానికి  జై ఆంధ్రా పేరుతో  ఒక ఉద్యమం పుట్టిందంటారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ హై కమాండ్ పై ఆంధ్రా నాయకుల ఒత్తిడి పెరగడంతో పీవీ, 1973 లో కుర్చీ నుంచి దిగక తప్పలేదన్నది పొలిటికల్ ఎనలిస్టుల అభిప్రాయం.

మంధని నుంచి నాలుగుసార్లు  అసెంబ్లీకి
ఎక్కడున్నా సరే, ఏ పదవిలో ఉన్నా సరే తన మార్క్ ఉండేలా చూసుకునేవారు పీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1957 లో తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంధని నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 1972 వరకు  మంధని నియోజకవర్గానికి వరుసగా నాలుగు సార్లు ఆయన  ప్రాతినిధ్యం వహించారు. దీన్ని బట్టి మంధని లో ఎలాంటి డెవలప్ మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 1962 లో న్యాయ, జైళ్ల శాఖ మంత్రి అయ్యారు. జైళ్ల శాఖలో  ఏం చేయగలంలే అనుకోలేదు. అక్కడ కూడా తన మార్క్ చూపించాలనుకున్నారు ఆయన. జైళ్లలో లైబ్రరీలను తొలిసారి ఏర్పాటు చేశారు. ఖైదీల్లో మంచి మార్పు కోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. 1964 లో దేవాదాయ శాఖామంత్రి అయ్యారు. ఈ సమయంలో మద్రాస్  రిలీజియస్  ఎండోమెంట్ చట్టాన్ని తెలంగాణ ప్రాంతంలోని రెగ్యులేషన్ చట్టంతో సమన్వయపరచి కొత్త చట్టాన్ని తయారు చేశారు. 1967లో  విద్యాశాఖా మంత్రి అయ్యారు. తెలుగును అధికార భాషగా చేయడానికి పునాదులు వేసిన ఘనత పీవీదే. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీవరకు తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే డిటెన్షన్  విధానం రద్దయింది. అంటే అప్పటివరకు స్టూడెంట్లు పరీక్షలు రాసి పాస్ అవడమో ఫెయిల్ అవడమో జరిగేది. అయితే ఆయన ఈ విధానాన్ని రద్దు చేశారు. ఏడో తరగతి వరకు పాస్, ఫెయిల్ సిస్టమ్ లేకుండా చేశారు.

కేంద్రమంత్రిగా అనేక శాఖలు చూసిన లీడర్
1972 నుంచి పీవీ నరసింహారావు నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.  కేంద్రమంత్రిగా అనేక శాఖలు   చూశారు.       ఇందిరా గాంధీ కేబినెట్ లో  విదేశాంగ మంత్రి గా పనిచేశారు.1985లో రాజీవ్ కేబినెట్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆపరేషన్ బ్లాక్ బోర్డు ’ పథకం పీవీ ఆలోచనల్లోంచి పుట్టిందే. దేశవ్యాప్తంగా అనేక సింగిల్ టీచర్ స్కూల్స్ ను డబుల్ టీచర్ స్కూల్స్ గా ఆయన మార్చారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అప్పుడు వచ్చిందే. కేంద్రీయ విద్యాలయాలు కూడా ఆయన ఆలోచనల్లోంచి పుట్టినవే. 1988లో రెండోసారి ఆయన విదేశాంగ మంత్రి అయ్యారు. ఇరుగుపొరుగు దేశాలతో మంచి సంబంధాల కోసం ప్రయత్నించారు.

ప్రధానిగా అన్నీ సొంత నిర్ణయాలే
పీవీ నరసింహారావు ప్రధానిగా పాలనపై తన మార్క్ వేశారు.  ప్రధానిగా ఆయన తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలు ఆయన ఆలోచనల్లోంచి వచ్చినవే. సోనియా గాంధీ సలహాలు, సూచనలు ఏమాత్రం లేవంటారు. దేశానికి ఏది మంచిదో అదే విధానంగా పీవీ ముందుకెళ్లారు. ప్రపంచదేశాల్లో ఇండియాకు ఒక గుర్తింపు తీసుకువచ్చారు. జీవితాంతం కాంగ్రెస్ కు ఒక సైనికుడిలా పనిచేసిన పీవీ నరసింహారావు పట్ల ఆ పార్టీ లీడర్లు సరిగా ప్రవర్తించలేదంటారు రాజకీయ పండితులు. 2004 లో ఆయన చనిపోయినప్పుడు ఒక మాజీ ప్రధాని హోదాలో ఢిల్లీలో ఆయన సమాధికి కాస్తంత స్థలం కూడా కేటాయించని విషయాన్ని  పొలిటికల్ ఎనలిస్టులు గుర్తు చేస్తుంటారు. దీని వెనుక సోనియా గాంధీ ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తన మాట విననందుకు పీవీపై  సోనియా కక్ష తీర్చుకున్నారన్నది  రాజకీయవర్గాల్లో వినిపించే విమర్శ.

ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే
ప్రధాని అయిన తర్వాత ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే ’ నంటూ పీవీ చేసిన కామెంట్స్ పాపులర్ అయ్యాయి. దేశానికి ప్రధాని అయినా తెలుగు నేల తన తల్లిలాంటిదని ఆయన చెప్పారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో తాను పుట్టి పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.

తొలి సౌత్ ప్రధాని
పీవీ నరసింహారావు ప్రధాని కావడంలో చాలా ప్రత్యేకతలున్నాయి. సౌతిండియా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా పీవీ చరిత్ర సృష్టించారు. తెలుగువాడు ప్రధాని కావడం అందరికీ గర్వకారణమైంది.  అప్పటివరకు కాంగ్రెస్ ప్రధానులంతా నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారే. అయితే పీవీ టోటల్ గా డిఫరెంట్. నాన్ నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు పీవీనే.

మెజారిటీ లేకుండా ఐదేళ్లు ….
లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎంపీలకు ఆయన లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు  కేసు కొట్టివేసింది.

ఇన్ సైడర్
పీవీ నరసింహారావు ఇంగ్లీషులో రాసిన  ‘ఇన్ సైడర్ ’ పుస్తకం బాగా పాపులర్. ఇన్ సైడర్ ను ఆయన జీవితగాథగా  చెబుతారు. ఇన్ సైడర్ ను ‘లోపలి మనిషి ’ పేరుతో తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేశారు. ఒక రాజకీయవేత్త జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదుడుకుల చుట్టూ ఈ నవల నడుస్తుంది. పీవీ స్వతహాగా మంచి అనువాదకుడు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉపన్యాసాన్ని  పీవీ అనువదించారు. ట్రాన్స్ లేషన్ లో పీవీ ప్రతిభ చూసి  నెహ్రూ ముగ్ధులయ్యారట. భుజం తట్టి ‘ వెరీ గుడ్ ’ అన్నారట. విశ్వనాథ  సత్యనారాయణ రాసిన ‘ వేయి పడగలు ’ నవలను ‘ సహస్ర ఫణ్ ’ పేరుతో హిందీలోకి  తర్జుమా చేశారు. సంగీతం, నాటకాలు, సిన్మాల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఎక్కువ.

14 భాషలు మాట్లాడగల మేధావి
పీవీ నరసింహారావు 14 భాషలు మాట్లాడగల మేధావి. చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒకసారి వింటే వెంటనే దానిని బుర్రలోకి ఎక్కించుకునే తెలివైన వ్యక్తి. ఐదారేళ్ల చిన్న వయసులోనే భారతం, రామాయణం, భాగవతంలోని శ్లోకాలను, పద్యాలను ఆయన అప్పచెప్పేవారు. 1937లో హయ్యర్ సెకండరీ పరీక్ష రాశారు. ఆ ఏడాది హైదరాబాద్ సంస్థానంలోనే  టాప్  మార్కులు తెచ్చుకుని నెంబర్ వన్ గా నిలిచారు. తర్వాత పై చదువులకు ఉస్మానియా వర్శిటీలో చేరారు.  వందేమాతరం పాడటంపై ఉస్మానియాలో నిషేధం ఉండేది. అయినా పీవీ పట్టించుకోలేదు. ధైర్యంగా వందేమాతరం పాడటంతో వర్శిటీ ఆయనను వెలేసింది. దీంతో మహారాష్ట్ర లోని నాగ్ పూర్ యూనివర్శిటీలో చేరి చదువు కొనసాగించారు. పూనాలో లా చదివారు. గోల్డ్ మెడల్ కొట్టారు. తొలిరోజుల్లో ఆయనపై స్వామి రామానంద తీర్థ ప్రభావం ఎక్కువగా ఉండేది.

బాబ్రీ మసీదు కూల్చివేతను ఆపలేకపోయారా ?
1992 లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనలో పీవీ పై విమర్శలు వచ్చాయి. కావాలనే మసీదు కూల్చివేతను ఆయన అడ్డుకోలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది కరెక్ట్ కాదంటారు చాలా మంది. మసీదు జోలికి వెళ్లేది లేదని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఇచ్చిన హామీని పీవీ గట్టిగా నమ్మారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మన్మోహన్ను తీసుకువచ్చింది పీవీనే
ఎకానమిస్టుగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పీవీ నరసింహారావే. మన్మోహన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం ఒకసారి చూద్దాం.   1985 నాటికి దేశ ఆర్థిక రంగం దెబ్బతినడం మొదలైంది. 1991 నాటికి పరిస్థితి మరీ భయంకరంగా మారింది. ఒక దశలో దిగుమతులు చేసుకున్న వస్తువులకు కూడా చెల్లించడానికి సైతం డబ్బులు ఉండేవి కావు. దీంతో ప్రపంచదేశాల్లో ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం నెలకొంది. దేశాన్ని ఇలా ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన ఈ పరిస్థితుల్లో  పీవీ ప్రధాని అయ్యారు. ప్రధాని కుర్చీలో కూర్చున్నారో, లేదో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రాంగం మొదలెట్టారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న  డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఫైనాన్స్ మినిస్ట్రీ అప్పగించారు. అంతేకాదు మన్మోహన్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉద్యోగాలే చేసుకునే  వ్యక్తి ఆర్థిక మంత్రిగా పనిచేయగలడా ? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే మన్మోహన్ తో తనకు కావలసిన విధంగా పనిచేయించుకోవడంలో పీవీ సక్సెస్ అయ్యారు. ఆర్థిక రంగంలో లిబరలైజేషన్ పాలసీకి ద్వారాలు తెరిచారు. దేశాన్ని  దివాళా స్థితి నుంచి  గట్టెక్కించడానికి ధైర్యంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తగ్గించగలిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికి వీలుగా చర్యలు తీసుకున్నారు. పీవీ సర్కార్ అమలు చేసిన  ఈ పాలసీల  ఫలితంగా దేశం ఫైనాన్షియల్ గా గట్టెక్కగలిగింది.
– రావుల రాజేశం, లెక్చరర్