మెజారిటీ లేకున్నా ప్రభుత్వాన్ని నడిపిన రాజకీయ భీష్ముడు

మెజారిటీ లేకున్నా ప్రభుత్వాన్ని నడిపిన రాజకీయ భీష్ముడు
  • మన పీవీ అపర చాణక్యుడు 
  • నేడు పీవీ వర్థంతి

చరిత్రను సృష్టించడం.. ఆ చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్యేకంగా రాసుకున్న గొప్ప నాయకుడు పీవీ నర్సింహారావు. తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో కనిపించే పీవీ దేశ రాజకీయాలను, ఆర్థిక స్థితిగతులను మలుపు తిప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగువాడు. తెలంగాణ ముద్దు బిడ్డ. ఎన్నో వివాదాలను, సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న మహా మేధావి. దివాలా పరిస్థితికి చేరిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యుడు. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వాన్ని ఐదేండ్ల పాటు నడిపిన రాజకీయ భీష్ముడు. వారసత్వ పార్టీలో ఏ అండా లేకుండా ఎదిగి.. ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిన లీడర్. రచయితగా, సాంస్కృతిక వారధిగా, బహు భాషా కోవిదునిగా, లాయర్​గా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటిన సవ్యసాచి పీవీ.

పాములపర్తి వెంకట నర్సింహారావు. ఈ పేరు చెపితే చాల మందికి తెలియకపోవచ్చుగానీ.. పీవీ అంటే దేశ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమే. ఢిల్లీకి రాజు అయినా తెలుగు ప్రాంతానికి ఆయన ముద్దుబిడ్డే. ఉమ్మడి వరంగల్​ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్​ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ.. ఆయనను దత్తత తీసుకోవడంతో పాములపర్తి వేంకట నర్సింహారావు అయ్యారు. పీవీకి రాజకీయం ఒంటపట్టడానికి ఆనాటి పరిస్థితులు కారణమయ్యాయి. నిజాం దమన నీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు..  పరాయి గడ్డ మీద చదువుకోవాల్సి వచ్చింది. దీంతో తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దాలనే తలంపు ఆనాడే కలిగింది. అందుకు స్వామీ రామానందతీర్థ శిష్యరికం, బూర్గుల రామకృష్ణారావుతో సాన్నిహిత్యం, తాను చదివిన న్యాయ శాస్త్రం ఆయనను ప్రేరేపించాయి. ఆ ప్రేరణే తెలుగు వారికి తెలుగు అభిమానం గల ఒక ముఖ్యమంత్రిని, దేశానికి దూరదృష్టి గల ఒక ప్రధానిని అందించగలిగాయి.

రాజకీయ భీష్ముడు
పీవీ చాలా మృదు స్వభావి. ఎప్పుడో గాని నవ్వరు. విషయం ఉంటే కానీ పెదవి విప్పరు. ప్రతిపక్షాలు మాటలతో దాడి చేసినా.. మౌనంగా తన పని తాను చేసుకుపోయే వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఏ రోజూ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించలేదు. అడ్డదారుల్లో అందలం ఎక్కాలన్న ఆకాంక్ష అసలే లేదు. రాజీవ్​గాంధీ మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యుడిగా ప్రధాని పీఠం ఎక్కారు. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పడం ఆయన నైజం. పాల నురుగు లాంటి స్వచ్ఛమైన వ్యక్తిత్వమే ఆయనను తెలుగు వారు గర్వించే స్థాయికి చేర్చింది. దేశ ఆర్థిక విధానంలోని ప్రతి అడుగులోనూ అంతర్లీనంగా పీవీ కనిపించేలా చేసింది. పీవీ నర్సింహారావు కాకలు తీరిన రాజకీయ నేత కాదు.. అయినా మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు సమర్థవంతంగా నడిపించిన ఘనుడు. అంతకు మించి సాహితీ ప్రియుడు. ఆయనతో పోల్చదగిన సాహితీవేత్త సమకాలీన రాజకీయాల్లో భూతద్దం వేసి వెతికినా కనిపించరు. ఆ మాటకు వస్తే ఆయనతో సరితూగే వారు ఎవరూ లేరు కూడా. జీవితాంతం లౌకికవాదాన్నే నమ్మిన సిద్ధాంతవాది. అయోధ్యలో మసీదు కూల్చివేత ఆరోపణలు ఎదుర్కొన్నా అన్నింటినీ మౌనంగానే భరించారు. విదేశీ సంబంధాలు గాడిన పెట్టడమే కాకుండా అణు పరీక్షలకు దేశాన్ని సిద్ధం చేసిన గొప్పతనం కూడా ఆయనకే చెల్లింది.

సంస్కరణలకు మార్గదర్శి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు పీవీ. వందేమాతర ఉద్యమంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో భూసంస్కరణల నుంచి జాతీయ స్థాయిలో ఆర్థిక సంస్కరణల వరకు ఎన్నో సంస్కరణలకు మార్గదర్శిగా మారారు. మందగతిన నడుస్తున్న ఆర్థిక వ్యవస్థకు పీవీ అందించిన కాయకల్ప చికిత్స ఈనాటికీ సత్పలితాలను ఇస్తోంది. దేశం ఆర్థిక స్వావలంబన సాధించడానికి మూల కారకుడైన పీవీ మన తెలుగువాడని గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలు.. ఆ తర్వాత పీవీ అనుసరించిన సరళీకృత విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. పీవీ ప్రధాని పదవి తీసుకునే ముందు దేశ ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. అలాంటి పరిస్థితులను చక్కదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థను గమ్యానికి చేర్చి ఎకానమీకి ఒక విలువ, గుర్తింపు కలిగించి దశదిశను చూపించిన మేధావి. 1991లో దేశం ఆర్థికంగా దివాలా తీసిన సమయంలో ఐఎంఎఫ్​ నుంచి తీసుకున్న సొమ్ము కూడా ఖర్చయ్యింది. ఏ విధంగానూ మనకు అప్పు పుట్టని పరిస్థితి. విదేశీ రుణం కోసం ఆశగా ఎదురు చూసే రోజుల్లో ఆర్థిక వ్యవస్థకు సంస్కరణల టానిక్ తో పట్టాలెక్కించారు పీవీ. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆర్థిక పరంగా మనం గట్టి పోటీ ఇచ్చేలా ఎదుగుతున్నామంటే దానికి పీవీ తెచ్చిన సంస్కరణలే కారణం.

దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసిన్రు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ ను నియంత్రించే సోషలిస్టు విధానాలే మనకు గతి అయ్యాయి. ఏదైనా కొత్త ఉత్పత్తి చేయాలన్నా.. దిగుమతి చేసుకోవాలన్నా ప్రతి దానికీ అనుమతి, లైసెన్సు తప్పనిసరి. ఎన్నో కంపెనీలను జాతీయం చేసినా పురోగతి శూన్యం. ఆ సమయంలో పీవీకి దొరికిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల రూపకర్తగా మన్మోహన్ ను ముందుపెట్టి వెనుక నుంచి అంతా నడిపించింది పీవీనే. రూపాయి మారకం విలువను కుదించారు. పారిశ్రామిక లైసెన్సులపై ఉన్న నిషేధం ఎత్తివేశారు. దీంతో పారిశ్రామిక రంగంలో అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు కార్మికులకు నష్టం కలగకుండా సంస్కరణలు చేపట్టారు. ఈ చర్యల వల్ల దేశ పురోగతి రేటు 7.5 శాతానికి పెరిగింది. పీవీ తర్వాత అధికారం చేపట్టిన ప్రభుత్వాలన్నీ ఆయన విధానాలనే కొనసాగించాయి. అంటే, ఆయన తెచ్చిన సంస్కరణలు ఎంత గొప్పగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. 2000లో మన జీడీపీ 8.5 శాతానికి చేరుకుందంటే ఆ మహానుభావుని చలవే.

బాబ్రీ మసీదు వివాదం
ఉత్తరప్రదేశ్ లో బాబ్రీ మసీదును కూల్చేస్తుంటే ప్రధాని పదవిలో ఉన్న పీవీ అచేతనంగా ఉండిపోయారన్న.. విధ్వంసాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేయలేదని పీవీపై కొందరు విమర్శలు చేశారు. అయితే ఇందులో పీవీ తప్పు లేదని, ఆయన నిర్దోషి అని లిబర్హాన్​ కమిషన్ తేల్చి చెప్పింది. ఏ రాజకీయ వారసత్వం లేకున్నా సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చి దేశ భవిష్యత్​కు బాట వేశారు. పీవీ తెలుగు, ఇంగ్లిష్ తోపాటు హిందీ, మరాఠీ మొదలైన 17 భాషలను అసువుగా మాట్లాడే వారు. రాజకీయంలో ఎంత బిజీగా ఉన్నా తనకు నచ్చిన సాహిత్యాన్ని ఏనాడు మర్చిపోలేదు. రచనలు చెయ్యడం ఆపలేదు. విశ్వనాథ కవి రచించిన వెయ్యి పడగలు నవలను సహస్ర ఫణ్​ పేరిట హిందీలోకి అనువదించారు. దీనికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని అబల పేరుతో తెలుగులోకి అనువదించారు. ఇన్ సైడర్ పేరుతో తన ఆత్మకథను నవలగా రాశారు. 2004, డిసెంబర్ 23న పీవీ కన్నుమూశారు.

ఆయన బాట ఆదర్శప్రాయం
కాలం కలిసి రాని వేళల్లో మౌనమే మంచిదన్న ఆయన సూత్రం ఇప్పటి రాజకీయ నాయకులకు ఆదర్శం. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలకు ఎదిగిన ఈ పంతులు దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఆణిముత్యం. ఆయన చూపిన బాట, వేసిన అడుగులు ముందు తరాలకు ఆదర్శప్రాయం. నిండు కుండ తొణకదు అన్నట్టుగా రాజకీయ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నింటినీ ఆయన మౌనంగానే భరించారు. అవకాశవాద రాజకీయాలు చేయలేదు. ప్రపంచ పటంలో భారత ఖ్యాతిని, రాష్ట్ర ఉనికిని చాటిన ఆ మహనీయుని విగ్రహాన్ని పార్లమెంట్​ లోపల ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను మరింత గొప్పగా పిల్లలకు తెలియజేయాలి. అప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్టవుతుంది.