ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండియాకు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో సింధుకు ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు పీవీ సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీలలో రెండు పతకాలను సాధించిన మొదటి భారత మహిళగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇంతవరకూ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు.

జియావోతో మొదటి గేమ్‌లో సింధు 21/13 స్కోర్‌తో గెలిచారు. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచీ ఆధిక్యాన్ని చూపించిన సింధు 21/15తో రెండో గేమ్ కూడా సొంతం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతకం గెలిచిన సింధును  ప్రధాని మోడీ అభినందించారు. పీవీ సింధు భారతదేశానికే గర్వకారణమైన ప్లేయర్ అని శుభాకాంక్షాలు తెలిపారు.

కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్స్ టీం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న టీం సభ్యులను మోడీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.