
- తడోబా తరహాలో యాక్షన్ ప్లాన్
- ఐదు సఫారీ వెహికల్స్ఏర్పాటు
- పీపీపీ పద్ధతిలో నిర్వహణ
- ఏకో టూరిజం పేరుతో అటవీశాఖ రూట్‌మ్యాప్
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇక టూరిజం కారిడార్‌గా మారబోతోంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని 78 వేల హెక్టార్లలో రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉండగా, ఇందులో 20శాతం మేర ఎకో టూరిజం పేరుతో అభివృద్ధి చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఎంపిక చేసిన ఏరియాలో పలు బ్యూటిఫుల్ లోకేషన్స్‌తో పాటు వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే గడ్డి మైదానాలు ఉన్నాయి. కడెం, గంగాపూర్, ఎక్బాల్పూర్, ఉడుంపూర్, కల్వకుంట్ల, ఆకోండపేట, గంగాపూర్ తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. టూరిస్టుల కోసం ప్రత్యేకంగా 5 సఫారీ వెహికల్స్ సమకూర్చేందుకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ సేకరిస్తున్నారు. మొత్తంమీద టూరిజం కారిడార్‌ను పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) పద్ధతిలో నిర్వహించబోతున్నారు.
తడోబా తరహాలో కవ్వాల్ టైగర్ జోన్ ను కూడా టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కడెం మండలం ఉడుంపూర్ వద్ద గల ఐ లవ్ కవ్వాల్ లోగో ప్రాంతం నుంచి మైసంపేట్, గంగాపూర్, లక్ష్మీపూర్ తదితర ప్రాంతాలను చూసేందుకు ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటు చేయనున్నారు. టూరిస్టుల కోసం వసతి సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. దిమ్మదుర్తి వద్ద 12, జన్నారం వద్ద 10 చొప్పున కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే ఈ టూరిజం స్పాట్ కింద కడెం ప్రాజెక్టును కూడా కవర్ చేస్తారు. కడెం ప్రాజెక్టు సమీపంలోని దాదాపు 550 మీటర్ల ఎత్తున గల గుట్టపై ఇప్పటికే వాచ్ టవర్ నిర్మించారు. టూరిస్టులను ఇక్కడివరకు తీసుకెళ్లి కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంతోపాటు దట్టమైన అడవులను వారికి చూపించనున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ 50 ఎకరాల్లో ఇప్పటికే అందమైన గడ్డి మైదానాలను పెంచింది. రూట్ మ్యాప్ కు అనుగుణంగా ఇప్పటికే సఫారీ వెహికల్స్తిరిగేందుకు రోడ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేశారు. మరో నెల రోజుల్లో టూరిజం స్పాట్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి కానున్నాయని, తర్వాత సందర్శకులను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.
స్థానికులకు ఉపాధి
కవ్వాల్ టూరిజం స్పాట్ నిర్వహణను పీపీపీ పద్ధతిలో చేపట్టనుండగా ప్రత్యేక చెక్ పోస్టుల వద్ద మాత్రం అటవీ శాఖ ఎంట్రీ ఫీజు వసూలు చేయనుంది. టైగర్ జోన్ పరిధిలోని గ్రామాలకు చెందిన విలేజ్ డెవలప్మెంట్కమిటీ(వీడీసీ)లు, అలాగే అక్కడి యువకులు సఫారీ వెహికల్స్ నిర్వహణను చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఫారెస్టు డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఈ వెహికల్స్కొనుగోళ్లకు సహకరించనుంది. స్థానిక యువకులకు రుణాలు అందించి వెహికల్స్ అప్పజెప్పనున్నారు. ఇక్కడి అడవి జంతువుల వివరాలు, చెట్ల రకాలు, ప్రత్యేకతలు స్థానిక యువకులకు బాగా తెలిసి ఉండడంతో వారినే గైడ్లుగా నియమించనున్నారు. మొత్తం టూరిజం స్పాట్ పరిధిని పర్యవేక్షించే బాధ్యత అటవీశాఖ చేపట్టబోతోంది.
మరో నెలలో పనులు పూర్తి
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని 20 శాతం కోర్, బఫర్ ఏరియాలను కలుపుకొని టూరిజం స్పాట్ ఏర్పడనుంది. మరో నెల రోజుల్లోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. స్థానిక వీడీసీలు, యువకులకే ఈ టూరిజం స్పాట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించాం. తడోబా తరహాలో కవ్వాల్ టైగర్ జోన్ దేశంలోనే ప్రత్యేక టూరిస్టు స్పాట్ గా మారుతుంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో ప్రచారం కూడా చేపట్టనున్నాం. – కోటేశ్వర్రావు, ఎఫ్‌డీవో, ఖానాపూర్