దేశంలో ఢిల్లీ జేఎన్​యూకు టాప్ ర్యాంక్

దేశంలో ఢిల్లీ జేఎన్​యూకు టాప్ ర్యాంక్
  • వరల్డ్ టాప్ 25 బెస్ట్ వర్సిటీల్లో ఐఐఎం అహ్మదాబాద్ 
  • బెంగళూరు, కోల్​కతా ఐఐఎంలకు టాప్ 50లో చోటు
  • క్యూఎస్ వరల్డ్ టాప్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల

న్యూఢిల్లీ: బిజినెస్ అండ్ మేనేజ్​మెంట్ స్టడీస్​లో ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మనదేశంలో బెస్ట్ యూనివర్సిటీ ర్యాంక్ దక్కింది. రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కేటగిరీలో ప్రపంచంలో టాప్ 20 ప్లేస్​లో నిలిచింది. 2024 ఏడాదికి గాను సబ్జెక్టులవారీగా ప్రపంచంలోని బెస్ట్ వర్సిటీల జాబితాను లండన్​కు చెందిన క్వాక్​వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) బుధవారం ప్రకటించింది. బిజినెస్ అండ్ మేనేజ్​మెంట్ స్టడీస్​లో ఐఐఎం అహ్మదాబాద్​కు వరల్డ్ టాప్ 25 కాలేజీల్లో చోటు దక్కింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్​కతాలకు ప్రపంచంలోని అత్యుత్తమ 50 కాలేజీల్లో చోటు లభించింది. చెన్నైలోని సవిత ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్​ అండ్ టెక్నికల్ సైన్సెస్ కాలేజీకి.. డెంటిస్ట్రీలో ప్రపంచంలో 24వ స్థానం దక్కింది. 

యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లో ఇండియా ఈ సంవత్సరం చాలా పురోగతిని సాధించిందని క్యూఎస్ సీఈవో జెస్సికా టర్నర్ మెచ్చుకున్నారు. గతేడాది కంటే ఈసారి రీసెర్చ్​అండ్ డెవలప్​మెంట్​ క్వాలిటీ 20 శాతం మెరుగుపడిందన్నారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్‌‌వర్క్ సూచికలో 16 శాతం వృద్ధి కనిపించిందన్నారు. తమ సర్వే ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్నన రీసెర్చ్ సెంటర్లలో ఒకటిగా నిలిచిందన్నారు. పరిశోధనల్లో ప్రపంచంలో చైనా, అమెరికా, ఇంగ్లండ్ తర్వాత నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ ఉందన్నారు. త్వరలోనే ఇంగ్లండ్​ను అదిగమించే అవకాశాలూ ఉన్నాయన్నారు.