చైనాకు క్వాడ్ దేశాల హెచ్చరిక

చైనాకు క్వాడ్ దేశాల హెచ్చరిక

టోక్యో: పొరుగు దేశాలతో కయ్యాలకు కాలుదువ్వుతున్న చైనాకు క్వాడ్ (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా) దేశాధినేతలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో దూకుడును తగ్గించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. రెచ్చగొట్టే, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు పాల్పడినా, ఏకపక్షంగా స్టేటస్ కో (ప్రస్తుతం ఉన్న స్థితి)ని మార్చాలని చూసినా ఒప్పుకోబోమని డ్రాగన్ కంట్రీని హెచ్చరించారు. ఏ వివాదాన్ని అయినా శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని, బెదిరింపులు, బలప్రయోగాలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతాల్లో మిలిటరీని దింపడం, సముద్ర జలాల్లో కోస్ట్ గార్డ్ నౌకలతో ఇతర దేశాల యాక్టివిటీలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు దిగరాదని తెలిపారు. మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. 

టెర్రర్ గ్రూపులపై కలిసికట్టుగా చర్యలు 
ఇండో-పసిఫిక్ లో టెర్రరిస్ట్ గ్రూపులపై కలిసికట్టుగా చర్యలు తీసుకుంటామని క్వాడ్ దేశాల నేతలు ప్రకటించారు. 26/11 ముంబై, పఠాన్ కోట్, తదితర టెర్రర్ అటాక్స్ ను తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 (1999) ప్రకారం.. గుర్తించిన టెర్రిస్టులు, టెర్రరిస్ట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టెర్రరిజం ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని మళ్లీ ఎప్పటికీ ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించుకోకుండా చూస్తామని, అక్కడి నుంచి టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. 

రష్యా వల్ల ఆహార సంక్షోభం: బైడెన్ 
ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపట్టిన యుద్ధం వల్ల ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు పెరుగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్ కల్చర్ ను పుతిన్ నాశనం చేస్తున్నారని, అక్కడ పంటలు పండే పరిస్థితిని లేకుండా చేయడంతో ఎగుమతులు ఆగిపోయి ఆహార సంక్షోభానికి కారణం అవుతున్నారని మండిపడ్డారు. ఇది యూరప్​కు మాత్రమే చెందిన సమస్య కాదని, గ్లోబల్​ఇష్యూ అని అన్నారు. రష్యా ఎంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తే.. అంతకాలం పాటు మిత్రపక్షాలకు అండగా నిలుస్తామని స్పష్టంచేశారు. క్వాడ్​అనేది ఒక మోజుతో పెట్టిన తాత్కాలిక కూటమి కాదని, ఇండో– పసిఫిక్ రీజియన్ లో అత్యంత శక్తిమంతమైన అలయెన్స్ అని వెల్లడించారు. క్వాడ్ భావితరాల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఏర్పడిందన్నారు. సదస్సు సందర్భంగా ముందుగా ప్రధాని మోడీకి బైడెన్ ఆహ్వానం పలికారు. మోడీని మరోసారి నేరుగా కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, జపాన్ లో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని మోడీ మంగళవారం ఇండియాకు తిరిగి బయలుదేరారు. 

జపాన్ వద్ద చైనా, రష్యా జెట్ల చక్కర్లు 
టోక్యోలో మంగళవారం ఒకపక్క క్వాడ్ దేశాధినేతల సమావేశం జరుగుతుండగా.. మరోవైపు జపాన్ కు సమీపంలోని ఎయిర్ స్పేస్ లో చైనీస్, రష్యన్ ఫైటర్ జెట్ లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంలో చైనా, రష్యా తీరుపై జపాన్ రక్షణ మంత్రి నొబుయో కిషీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చైనా, రష్యా జెట్ లు తమ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ కాలేదని, కానీ గత నవంబర్ నుంచి జపాన్ సమీపంలో ఫైటర్ జెట్లను చక్కర్లు కొట్టించడం ఇది నాలుగోసారని ఆయన చెప్పారు. ‘‘మంగళవారం రెండు చైనీస్ బాంబర్లు, రెండు రష్యన్ బాంబర్లు కలిసి జపాన్ సముద్రం నుంచి తూర్పు చైనా సముద్రం వరకూ ఉమ్మడిగా ఎగిరాయి. ఆ తర్వాత తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్ సముద్రం వరకూ మరో నాలుగు చైనీస్, రష్యన్ బాంబర్లు కలిసి ప్రయాణించాయి” అని నొబుయో మీడియాకు వెల్లడించారు. రష్యన్ ఇంటెలిజెన్స్ విమానం కూడా హొకాయిడో ద్వీపం మీదుగా ఎగిరిందని, ఈ చర్యలు క్వాడ్ దేశాలను రెచ్చగొట్టే చర్యేనని స్పష్టంచేశారు.  

ఇండో - పసిఫిక్ అభివృద్ధికి కట్టుబడతాం: ఐపీఈఎఫ్ 
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, న్యాయమైన వ్యాపారాన్ని కొనసాగించడం కోసం కట్టుబడి ఉంటామని ఇండియాతో పాటు మరో 12 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి సహకరించుకుంటామని ప్రకటించాయి. సోమవారం టోక్యోలో ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేంవర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్)’ వేదికను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రారంభించారు. మంగళవారం ఐపీఈఎఫ్ సభ్య దేశాలైన ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఈ మేరకు ప్రకటించాయి.